ఇద్దరు బాలికలపై.. యువకుడి లైంగికదాడి

Published: Tuesday June 19, 2018
ఇద్దరు బాలికలపై ఓ యువకుడు అత్యాచార యత్నం చేశాడు. వీరిలో ఒకరు ఈ యువకుడికి వరసకు కూతురు కావడం గమనార్హం. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు.. మహా విశాఖ 65వ వార్డు హరిజన జగ్గయ్యపాలేనికి చెందిన పెయింటర్‌ లాజరస్‌(25) గత బుధవారం తమ ప్రాంతంలో నివసిస్తున్న వరుసకు కూతురు అయ్యే బాలిక(8)తోపాటు సమీపంలో ఆడుకుంటున్న మరో బాలిక(8)ను తినుబండారాలు ఇస్తానంటూ ఇంట్లోకి పిలిచాడు.
 
బాలికలు ఇద్దరూ లోపలికి రాగానే టీవీ సౌండ్‌ పెంచి ఇద్దరి కాళ్లు, చేతులు చున్నీతో కట్టి, నోటిలో గుడ్డలు కుక్కి లైంగిక దాడికి యత్నించాడు. అయితే, వారు ప్రతిఘటించడంతో భయపడి విడిచిపెట్టాడు. కాగా, కుమార్తె వరసయ్యే బాలికకు జ్వరం రావడం, నీరసంగా ఉండడం గుర్తించిన ఆమె తల్లి శనివారం ప్రశ్నించడంతో జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో ఆ బాలిక తల్లి.. లాజరస్ ను నిలదీసి దేహశుద్ధి చేసింది. విషయం తెలుసుకున్న స్థానిక మహిళలు సోమవారం పోలీసులకు సమాచారం అందించారు.