కూతుర్నే కడతేర్చడానికి ప్లాన్ వేసిన తల్లి
Published: Thursday June 21, 2018

అల్లరి చేస్తున్నదని కన్న కూతుర్నే కడతేర్చడానికి ప్లాన్ వేసిందో కసాయి తల్లి. ఏడేళ్ల చిన్నారికి చీమల మందు తాగించి స్పృహ కోల్పోయాక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బ్లేడుతో విచక్షణా రహితంగా గాట్లుపెట్టింది. చనిపోయిందని భావించి ఏమీ తెలియనట్టు ఇంటికెళ్లిపోయింది. కానీ... స్పృహలోకి వచ్చిన ఆ చిన్నారి ఎలాగోలా అమ్మమ్మ ఇంటికి చేరడంతో తల్లి చేసిన నిర్వాకం బయటపడింది. రాజమహేంద్రవరంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటనకు సంబంధించి ఈస్ట్ జోన్ డీఎస్పీ యు.నాగరాజు బుధవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
దివాన్‌చెరువుకు చెందిన మచ్చా శారదకు ఇద్దరు ఆడ పిల్లలు. భర్త వదిలేయడంతో హోటల్లో పనిచేస్తూ వేరొక వ్యక్తితో సహజీవనం సాగిస్తోంది. ఈనెల 18న పని నుంచి ఇంటికి వచ్చేసరికి పెద్ద కూతురు మహాలక్ష్మి అల్లరి చేస్తుండడంతో బాగా కొట్టింది. దీంతో మహాలక్ష్మి దగ్గరలోని అమ్మమ్మ ఇంటికెళ్లింది. అక్కడి నుంచి ఆ చిన్నారిని కొట్టుకుంటూ తీసుకొచ్చిన శారద... ఆపై చీమల మందు తాగించింది. పాప స్పృహ కోల్పోయాక అర్ధరాత్రి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కాళ్లు చేతులు కట్టేసి, ఆమె శరీరంపై బ్లేడుతో విచక్షణారహితంగా కోసింది.
బాలిక మర్మాంగాలపైనా బ్లేడుతో గాయపర్చింది. ఆ తర్వాత బాలిక చనిపోయిందని భావించి వెళ్లిపోయింది. కానీ కొద్దిసేపటికి మెలకువ వచ్చిన ఆ చిన్నారి ఎలాగాలో కట్లు విప్పుకొని అతికష్టమ్మీద అమ్మమ్మ ఇంటికి చేరింది. చిన్నారిని ఆస్పత్రికి తరలించగా ఆమె శరీరంపై ఉన్న గాయాలకు డాక్టర్లు 103 కుట్లు వేశారు. బాలిక పిన్ని ఫిర్యాదుతో శారదను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. శారద విపరీతమైన ప్రవర్తన కలిగి ఉండేదని, తన మాట చెల్లకుంటే తనకు తాను బ్లేడుతో కోసుకోవడం లేదా ఎదుటి వారిని గాయపర్చడం గతంలో చేసిందని పోలీసులు చెబుతున్నారు. అక్రమ సంబంధం నేపథ్యంలో కూతురిని కడతేర్చడానికి ప్లాన్ చేసిందా? అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి స్వయంగా కేసును పర్యవేక్షిస్తున్నారు.

Share this on your social network: