తండ్రిని హత్య చేయించిన మైనర్ బాలిక

Published: Saturday November 13, 2021

ఆడపిల్లకు తండ్రే ప్రాణం. తండ్రే రియల్ హీరో. తండ్రి తర్వాతే వేరే ఎవరైనా.. కానీ ఆ కూతురుకు మాత్రం తండ్రే విలన్‌లా కనిపించాడు. ప్రియుడి తర్వాతే ఎవరైనా అనుకుందేమో.. సుపారీ ఇచ్చి మరీ తండ్రిని దారుణంగా హత్య చేయించింది. ఈ ఘోరం.. హైదరాబాద్‌లోని కుషాయిగూడలో చోటు చేసుకుంది. ప్రియుడి కోసం కన్న తండ్రిని మైనర్ బాలిక హత్య చేయించింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. రామకృష్ణ అనే వ్యక్తి తన కూతురిని అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. ఇటీవల ఆమె ప్రేమ విషయం తెలిసి.. మానుకోవాలంటూ మందలించాడు. దీంతో ద్వేషాన్ని పెంచుకున్న ఆ కూతురు.. ప్రియుడితో కలిసి తండ్రి హత్యకు స్కెచ్ గీసింది.

 

ముందుగా అనుకున్న ప్రకారం ఆహారంలో మత్తు మందు కలిపి రామకృష్ణ సృహ కోల్పోయేలా చేసింది. అనంతరం ప్రియుడు భూపాల్‌ సహకారంతో సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించింది. కింద పడి మృతి చెందాడని పోలీసులకు కుటుంబ సభ్యులు తప్పుడు సమాచారమిచ్చారు. అయితే పోస్ట్‌ మార్టం రిపోర్ట్‌ మాత్రం హత్యను పట్టిచ్చేసింది. కూతురు, ప్రియుడు సహా మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గత జులైలో కుషాయిగూడలో ఈ ఘటన జరిగింది. నిందితురాలు మైనర్‌ కావడంతో పోలీసులు ఆమెను జువెనైల్ హోంకు తరలించారు.