తల్లిని కొట్టాడని.

తల్లిని కొట్టాడనే కోపంతో కన్న తండ్రినే కత్తులతో నరికి చంపిన కుమారుల ఉదంతం కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని చిగురుమానుపేటలో నివాసం ఉంటున్న కృపానందం కుటుంబ కలహాల నేపథ్యంలో కొన్ని నెలలుగా కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. వారం క్రితం ఇంటికి వచ్చి భార్యతో గొడవపడి ఆమెను కొట్టినట్టు చెబుతున్నారు. దీంతో ఆయన కుమారులు నాగన్న అలియాస్ జేమ్స్, పెద్దకాంతు, చిన్నకాంతు కోపం పెంచుకున్నారు. సోమవారం రాత్రి స్థానిక రైల్వేస్టేషన్ ఎదురుగా కట్టపై ఉన్న కృపానందంపై తాగిన మైకంలో ఉన్న కొడుకులు కత్తులతో దాడి చేశారు. కాళ్లు, చేతులు, తలపై కిరాతకంగా నరికారు. తలపై బీరు సీసాలతో కొట్టారు. రక్తపు మడుగులో కుప్పకూలిన కృపానందంను స్థానికులు డోన్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ఆయన మృతి చెందారు. నాగన్న, పెద్దకాంతు, చిన్నకాంతుపై కేసు నమోదు చేసినట్టు డోన్ సీఐ రాజగోపాల్‌నాయుడు తెలిపారు.

Share this on your social network: