క్షణికావేశంలో కొట్టాడు..... చంద్రిక సోదరి ఆవేదన

Published: Monday July 02, 2018
చందర్లపాడు ‘‘ మా నాన్న చాలా మంచోడు.. నా కన్నా మా అక్క చిన్ని (చంద్రిక) అంటేనే ఎక్కువ ప్రేమ.... క్షణికావేశంలో అనర్థం జరిగిపోయింది. ఇప్పుడు అందరం బాధపడుతున్నాం...’’ అంటూ చంద్రిక సోదరి శిరీష కన్నీరు పెట్టుకుంది. చందర్లపాడు మండలం తోటరావులపాడులో శనివారం కన్న తండ్రి తొండెపు కోటయ్య కర్రతో మోదటంతో చంద్రిక మృతి చెందిన సంగతి విదితమే.
 
చంద్రిక మృతదేహానికి ఆదివారం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేశారు. అనంతరం బంధువులకు అప్పగించటంతో స్వగ్రామానికి తీసుకువెళ్లారు. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. తండ్రి కోటయ్య పోలీసులు అదుపులో ఉన్నాడు. కూతురు చంద్రిక మృతదేహాన్ని కడసారిగా చూసేందుకు అతనిని పంపించాల్సిందిగా కుటుంబ సభ్యులు వేడుకున్నా పోలీసులు అంగీకరించలేదు.
 
కుటుంబ సభ్యుల, బంధువుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, జడ్‌పీటీసీ సభ్యుడు వాసిరెడ్డి ప్రసాద్‌, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట వీరబాబు, మండల పార్టీ అధ్యక్షుడు మేకల సుధాకర్‌ తదితరులు చంద్రిక మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.