ఫైనాన్స్ రుణం అది తీరకుండానే, అంతా కట్టేసినట్టు నకిలీ
Published: Thursday July 12, 2018

చేతికి, మెడకు ఖరీదైన బంగారు ఆభరణాలు వేస్తాడు. వంటిపై ఖద్దరు నలగనివ్వడు. వాడిన వాహనం వాడడు. ఈ బిల్డ్‌పతో ఏకంగా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల కళ్లలోనే కారం కొట్టాడు. ఒక్కో వాహనంపై నాలుగు ఫైనాన్స్ రుణాలు తీసుకొని, ఆ సంస్థలను రూ. కోట్లలో కొల్లగొట్టేశాడు. పోలీసుల కథనం ప్రకారం, ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన నైనాల చంద్రశేఖర్ గ్రానైట్ కంపెనీల వద్ద లారీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. లారీలో గ్రానైట్ లోటుతో ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు, దొంగ బండ్లు కొని, అమ్మే అక్కడి ముఠాలతో చంద్రశేఖర్‌కు పరిచయం ఏర్పడింది. ఈ ముఠాల సాయంతో తొలినాళ్లలో దొంగతనంగా జేసీబీలను తీసుకొచ్చి విక్రయించేవాడు. ఆ వాహనాలకు తప్పుడు పత్రాలు సృష్టించి, వాటిని ఆర్‌టీఏ కార్యాలయంలో అందజేసి సుమారు రూ.లక్ష వరకు రోడ్డు ట్యాక్స్ చెల్లించి స్థానిక రిజిస్ట్రేషన్ పొందేవాడు.
ఆ తరువాత ఆ వాహనం అమ్మేసేవాడు. ఆ తర్వాతర్వాత కార్లు, జీపులను తెచ్చి, అమ్మి సొమ్ముచేసుకోవడం మొదలుపెట్టాడు. ఇలా చూస్తుండగానే కోట్ల రూపాయలు వెనుకేసుకొన్నాడు. ఏడాది తిరిగేటప్పటికి ఒక గ్రానైట్ కంపెనీనే కొనేసే స్థాయికి చంద్రశేఖర్ ఎదిగాడు. 2015లో తన భార్య అపర్ణ పేరిట చీమకుర్తిలో ఈ కంపెనీని ఏర్పాటుచేశాడు. ఒంగోలులో రూ.రెండు కోట్లతో అన్ని హంగులతో ఇల్లు కట్టుకొన్నాడు.
నకిలీ పత్రాలతో దందా
ముందుగా ఖరీదైన వాహనాన్ని చంద్రశేఖర్ కొనుగోలు చేస్తాడు. ఆ వాహనంపై ఫైనాన్స్ సంస్థ నుంచి రుణం తీసుకుంటాడు. అప్పు తీర్చకుండానే, అంతా కట్టేసినట్టు నకిలీ ఎన్‌వోసీని సృష్టిస్తాడు. ఆ పత్రాలను ఆర్‌టీఏ కార్యాలయంలో చూపించి, క్లియరెన్స్ పొందుతున్నాడు. తిరిగి అవే పత్రాలతో మరో ఫైనాన్స్ సంస్థను సంప్రదించి, మరోసారి రుణం పొందుతాడు. తిరిగి అదే తంతు! ఇలా ఒకే వాహనంపై నాలుగు ఫైనాన్స్ రుణాలు తీసుకొన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ విషయంలో చంద్రశేఖర్‌కు ఆర్‌టీఏలోని కిందిస్థాయి సిబ్బంది సహకారం అందుతున్నట్టు భావిస్తున్నారు. లేదంటే ఒకే వ్యక్తి అవే పత్రాలతో పదేపదే ఆర్‌టీఏ క్లియరెన్స్ (సీసీ) పొందటం సాధ్యం కాదని అంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల గుంటూరుకు చెందిన ఓ వ్యక్తికి రూ.30 లక్షలకు రెండు లేటెస్ట్ ఇన్నోవా వాహనాలను చంద్రశేఖర్ విక్రయించాడు.

Share this on your social network: