తల్లిని వెయ్యి అడిగితే రూ.500 ఇచ్చిందని..
Published: Sunday July 15, 2018

(విజయవాడ): ఖర్చులకు రూ.వెయ్యి అడిగితే తల్లి రూ.500లే ఇచ్చిందన్న మనస్తాపంతో కుమార్తె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన అజిత్‌సింగ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందమూరు నగర్ తోటవారి వీధిలో శనివారం జరిగింది. మృతురాలి తల్లిదండ్రులు పోలీస్ శాఖలో ఒకరు ఏఎస్సైగా, మరొకరు కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. అజిత్‌సింగ్‌నగర్ ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఏఎస్సైగా పని చేస్తున్న వర, గన్నవరం పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సత్యనారాయణ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె సింగంపల్లి హారిక (22) బెంగళూరులో మల్టీ మీడియా కోర్సు పూర్తి చేసి కొంతకాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తోంది.
ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం తల్లిని ఖర్చులకు రూ.వెయ్యి కావాలని అడిగింది. తల్లి రూ.500 ఇచ్చింది. ఇచ్చిన డబ్బును అయిష్టంగానే తీసుకున్న హారిక తల్లిదండ్రులు విధులకు వెళ్లిన తర్వాత రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం ఉదయం పనిమనిషి వచ్చి తలుపు కొడుతున్నా తీయకపోవడంతో అప్పుడే రాత్రి విధులు ముగించుకుని వచ్చిన తల్లిదండ్రులు కిటికీ తలుపులు తెరచి చూడగా కుమార్తె ఉరేసుకొని కనిపించింది. సమాచారం అందుకున్న అజిత్‌సింగ్‌నగర్ ఎస్సై శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Share this on your social network: