గ్యాస్‌ కట్టర్‌తో లాకర్‌కు రంధ్రం

Published: Sunday July 29, 2018
అనంతపురం జేఎన్‌టీయూ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచ్‌లో శుక్రవారం అర్ధరాత్రి భారీచోరీ జరిగింది. అనంతపురం డీఎస్పీ వెంకట్రావు, బ్యాంకు మేనేజర్‌ శర్మ కథనం మేరకు.. రోజువారీ విధులు ముగిసిన తర్వాత శుక్రవారం రాత్రి 7:30గంటల సమయంలో మేనేజర్‌ శర్మ బ్యాంకుకు తాళాలు వేసి ఇంటికి వెళ్లిపోయారు. శనివారం ఉదయం 9:30 గంటలకు తిరిగి బ్యాంకు తాళాలు తీసి లోపలకు వెళ్లగా లాకర్‌ ముందు సిలిండర్‌, గ్యాస్‌ కట్టర్‌, డ్రిల్లింగ్‌ మిషన్‌తోపాటు వైర్లు కనిపించాయి. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, డీఎస్పీ వెంకట్రావు, సీఐ భాస్కర్‌రెడ్డి, సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. లాకర్‌కు ఓ వైపు గ్యాస్‌కట్టర్‌తో రంధ్రంచేసి ఉండడంతోపాటు అందులో రూ.39 లక్షల డబ్బులు అపహరించినట్లు గుర్తించారు. చోరీ జరిగిన తీరును సీసీ ఫుటేజీలను బట్టి పరిశీలిస్తే.. ఇద్దరు ముసుగు దొంగలు పక్కనే ఉన్న పోస్టాఫీస్‌ భవనం ప్రహరీ దూకి బ్యాంకు ఆవరణలోకి ప్రవేశించారు.
 
కిటికీ ఇనుప చువ్వలను గ్యాస్‌కట్టర్‌తో తొలగించారు. కిటికీకి లోపలివైపు అమర్చిన అద్దాలను పగులగొట్టారు. అర్ధరాత్రి 2:29 గంటల సమయంలో బ్యాంకు లోపలికి ప్రవేశించి ముందుగా విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. అలారాన్ని డిస్‌ కనెక్ట్‌చేశారు. బ్యాంకులో 26 సీసీ కెమెరాలు ఉండగా అందులో పదింటిని ధ్వంసం చేశారు. టార్చ్‌లైట్‌ వెలుగులో లాకర్‌ తాళాల కోసం వెతికినా దొరక్కపోవడంతో తమ వెంటతెచ్చుకున్న గ్యాస్‌కట్టర్‌తో లాకర్‌కు రంధ్రంచేసి అందులో ఉన్న డబ్బులను దోచుకుపోయారు. దొంగలు ఎలాంటి ఆధారాలు, ఆనవాళ్లు లభించకుండా చేతులకు గ్లౌస్‌లు, ముఖాలకు మాస్క్‌లు వేసుకున్నారు. డీఎస్పీ పర్యవేక్షణలో గాలింపు చర్యలు మొదలయ్యాయి. క్లూస్‌టీమ్‌ వేలిముద్రలను సేకరించగా, డాగ్‌ స్క్వాడ్‌ పరిసర ప్రాంతాలను పరిశీలించింది. కాగా, ఈ బ్యాంకుకు సెక్యూరిటీ గార్డును నియమించకపోవడం గమనార్హం.