కత్తితో మహిళ హల్‌చల్

Published: Monday July 30, 2018
కందులవారిపల్లె: కడప జిల్లా కందులవారి పల్లెలో ఓ మహిళ కత్తితో హల్‌చల్ చేసింది. వీఆర్వో, పోలీస్‌కానిస్టేబుల్‌ను తిడుతూ కత్తితో బెదిరించింది. తమతో పెట్టుకుంటే ఉద్యోగాలు ఉండవంటూ హెచ్చరించింది.
 
చిట్వేల్ మండలంలో కందులవారిపల్లె తిప్పికుంట చెరువుకట్టను ఐదు గ్రామాల దళితులు ఉపయోగించుకుంటున్నారు. శ్మశానవాటికకు వెళ్లాలంటూ ఈ చెరువుకట్టపై నుంచి వెళ్లాల్సింది. అయితే ఈ చెరువుకట్టను అదే గ్రామానికి చెందిన చలపతి, మరికొందరు కబ్జాచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై దళితులు ఫిర్యాదు చేయడంతో అధికారులు ఎంక్వైరీకి వచ్చారు. ఆ సమయంలోనే చలపతి భార్య, కూతురు వీరంగం చేశారు.
 
వివాదాస్పద స్థలానికి వెళ్లిన వీఆర్వో, కానిస్టేబుల్‌ను చలపతి భార్య, కూతురు బెదిరించారు. తాము ఎలంటి ఆక్రమణ చేయలేదని చెబుతూ, తమ జోలికి వస్తే చంపేస్తామంటూ హెచ్చరించారు. చెరువు కబ్జా విషయమై ఉన్నతాధికారులకు తాము ఎన్నిసార్లు చెప్పినా చలపతి ఆగడాలు ఆగడం లేదని గ్రామస్థులు అంటున్నారు. వెంటనే చెరువుకట్టపై హెచ్చరికబోర్డు పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.