బాలుడిని హిజ్రాగా మార్చే యత్నం

Published: Saturday August 04, 2018

నీలోని హార్మోన్స్‌ మొత్తం మారిపోయాయి... నువ్వు ఇకపై మాలో ఒకడిగా ఉండిపొమ్మంటూ ఓ బాలుడికి మాయమాటలు చెప్పి హిజ్రాగా మార్చేందుకు ప్రయత్నించిన ఘటన కండ్రిక కాలనీలో జరిగింది. మోసానికి పాల్పడిన హిజ్రాపై నున్న రూరల్‌ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం.. మంగళగిరి ఆత్మకూరుకు చెందిన బాలుడు (15) ఇటీవల పదవ తరగతి పూర్తిచేశాడు. స్థానిక రాధానగర్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదివేందుకుగానూ రెండు నెలల క్రితం కండ్రిక కాలనీలో ఉంటున్న తన అక్క నమిత ఇంటికి వచ్చాడు. అక్క ఇంట్లోనే ఉంటూ కళాశాలకు వెళ్తున్న బాలుడికి ఇంటి యజమాని స్రవంతి(హిజ్రా)తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి బాలుడు కళాశాలకు సరిగ్గా వెళ్లకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి ఆరా తీశారు. అయితే, బాలుడిని కళాశాలకు వెళ్లనీయకుండా తమతో పాటు షాపుల్లో వసూళ్లకు తీసుకువెళుతున్నారని, హార్మోన్లు మారిపోయాయని నమ్మించి వారం రోజుల్లో ముంబయి తీసుకెళ్లి, ఆపరేషన్‌ చేయించి హిజ్రాగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కుటుంబ సభ్యులు గుర్తించారు. జరిగిన విషయమై నున్న రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు హిజ్రాను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.