మంగళవారం ఆ బాలుడిని కిడ్నాప్ చేస్తున్నారట
Published: Wednesday August 08, 2018

ఓ ప్రైవేట్ పాఠశాల నుంచి బాలుడు అదృశ్యమైన ఘటన మంగళవారం ఆగిరిపల్లిలో కలకలం సృష్టించింది. చిన్నాగిరిపల్లి గొల్లగూడెం గ్రామానికి చెందిన వీర్ల లీలాప్రసాద్(12) ఆగిరిపల్లి ఎస్.వి. ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. రోజు మాదిరిగానే పాఠశాలకు వచ్చిన లీలాప్రసాద్ పాఠశాలలో ప్రేయర్ జరిగే సమయానికి మూత్రవిసర్జనకు అని బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో పాఠశాల సిబ్బంది అతడి కోసం వెతికినా కనిపించకపోవడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన తండ్రి వీర్ల రమేష్ పాఠశాలకు వచ్చి తమ కుమారుడిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సరిగ్గా గత మంగళవారం కూడా తన కుమారుడిని కిడ్నాపర్లు అపహరించుకుపోయి అమ్మవారిగూడెం సమీపంలోని మామిడితోటల్లో కట్టిపడేయగా స్థానికులు కాపాడినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నాడు.
పోలీసులు కేసు నమోదు చేసిన గంటల వ్యవధిలోనే అదృశ్యమైన లీలాప్రసాద్ చేతులకు కట్లు కట్టిన స్థితిలో పాఠశాల వెనుకవైపు ఉన్న పాడుపడ్డ భవనంలో నుంచి బయటకు వస్తూ కనిపించడంతో స్థానికులు అతడిని పోలీసుస్టేషన్‌లో అప్పగించారు. తనను కొందరు వ్యక్తులు బలవంతంగా చేతులు కట్టిపడేసి పాడుపడ్డ భవనంలోకి తీసుకువెళ్లినట్లుగా అతడు చెబుతున్న కథనానికి, వాస్తవ పరిస్థితులకు సంబంధం లేకుండా ఉంది. అతడిని తాళ్లతో ఎవరు కట్టేశారు, రెండు మంగళవారాల నుంచి ఎందుకు ఇలా జరుగుతోంది అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆగిరిపల్లి ఎస్సై వి.యేసేబు దర్యాప్తు చేపట్టి బాలుడ్ని తల్లిదండ్రులకు అప్పగించారు.

Share this on your social network: