చెక్‌పోస్టులో అక్రమ రవాణాకు అనుమతిచ్చి భారీ ముడుపులు
Published: Saturday August 11, 2018

అక్రమ మద్యం తరలిపోకుండా కాపు కాయాల్సిన వాడే, దగ్గరుండి రాష్ట్రం దాటించాడు. చెక్‌పోస్టు డ్యూటీలో చిక్కినంత వెనుకేసుకొన్నాడు. చివరకు ఏసీబీకి దొరికిపోయాడు. అక్రమాస్తులను భారీగా కూడబెట్టారన్న సమాచారంతో కర్నూలు జిల్లా నాగులదిన్నె చెక్‌పోస్టు ఎక్సైజ్ ఎస్‌ఐ ఎర్రగోవుల విజయకుమార్ ఇళ్లు, కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు తనిఖీలు జరిపారు. చిత్తూరు జిల్లా కాజూరులోని ఆయన నివాసంలో రూ.10 లక్షల నగదు, మరో రూ. 10 లక్షలు విలువైన 700 గ్రాముల బంగారం, మూడు వాహనాలు, ఇళ్లు, ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకొన్నారు. విజయకుమార్‌కు మూడు బ్యాంకుల్లో లాకర్లు ఉన్నట్టు గుర్తించారు. వీటిలో రెండు చిత్తూరులో, మరోకటి వేలూరు జిల్లా కాట్పాడిలో ఉన్నాయి. వాటిని తెరవాల్సి ఉంది. ఇప్పటిదాకా జరిపిన సోదాల్లో, ఆయన రూ. 10 కోట్లకు పైగా అక్రమాస్తులు వెనుకేసినట్టు గుర్తించారు. విజయకుమార్‌ను అరెస్టు చేసి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచేందుకు నెల్లూరు తరలించారు. కాగా, విజయకుమార్ గతంలో స్పిరిట్ అక్రమ రవాణా కేసులో సీబీ సీఐడీ పోలీసులకు పట్టుబడి సస్పెండ్ కావడం గమనార్హం. ఈ కేసు విచారణ పెండింగ్‌లో ఉంది.
గతంలో సస్పెండ్ అయినా..

ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్‌గా చేరిన విజయకుమార్.. ఎక్కడ విధులు నిర్వహించినా లంచాలు పడతాడని పేరు. 2014లో చిత్తూరు జిల్లా రేణిగుంట ఐఎంఎల్ డిపోలో విజయకుమార్ పనిచేశారు. ఆ సమయంలో స్పిరిట్ అక్రమ తరలింపు వ్యవహారంలో సీబీసీఐడీ పోలీసులకు దొరికిపోయారు. ఆ వ్యవహారంలో ఆరు నెలల సస్పెన్షన్ ఎదుర్కొని ఆ తర్వాత విధుల్లో చేరారు. అయినా, అక్రమ దందా తగ్గించలేదని ఏసీబీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఎనిమిది బృందాలుగా విడిపోయి.. ఏపీ, తమిళనాడు పరిధిలో విస్తృత తనిఖీలు జరిపారు.
ఆయన పనిచేస్తున్న నాగులదిన్నె చెక్‌పోస్టు, కర్నూలులోని ఆయన నివాసం, చిత్తూరులోని ఆయన ఇల్లు, తిరుపతిలోని సోదరి నివాసం, తమిళనాడు వేలూరు జిల్లా కాట్పాడిలోని అత్తగారిల్లు సహా పలుచోట్ల బృందాలుగా ఏర్పడి ఏసీబీ అధికారులు తనిఖీలు జరిపారు. విజయకుమార్ పేరిట చిత్తూరులోని ఇరువారంలో ఒక షెడ్, అతని భార్య మీనా పేరిట కాజూరులో మూడు ఇళ్లు, గిరింపేటలో ఒక ఇల్లు, ఇరువారంలో ఎనిమిది, కాజూరులో ఒకటి, తమిళనాడులోని కాట్పాడిలో ఒకటి చొప్పున మొత్తం పది ఇళ్ల స్థలాలు, యాదమరి మండలంలోని ఆరు ఎకరాల వ్యవసాయ భూముల డాక్యుమెంట్లను గుర్తించారు. కుమారుడు వివేక్ పేరిట కాజూరులో ఇంటి స్థలం ఉన్నట్టు కనుగొన్నారు. విజయ్‌కుమార్ భార్య, కుమారుల పేరిట రెండు కార్లు, ట్రాక్టర్ ఉన్నట్టు గుర్తించారు.

Share this on your social network: