ప్రాణం తీసిన బైక్‌ రేసింగు

Published: Sunday August 19, 2018
వి.కోట(చిత్తూరు జిల్లా): బైక్‌ రేసింగ్‌కు వెళ్ళి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురై ఓ యువకుడు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వి.కోటకు చెందిన నలుగురు యువకులు శుక్రవారం రాత్రి రెండు బైక్‌లపై ముళబాగళ్‌ బైపాస్‌ రోడ్డులో రేసింగ్‌కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో తాయలూరు వద్ద ముందు వెళుతున్న ట్రాకర్ట్‌ను అధిగమించబోయి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో వి.కోటకు చెందిన ఫైజ్‌(18) అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు యువకులు గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారిలో షారూ అనే యువకుడు కోమాలోకి వెళ్లాడు. కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి కాలు విరిగిపోయింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని ఫైజ్‌ మృతదేహాన్ని వి.కోటకు తరలించారు.
 
 
కాగా, ఇటీవల వి.కోట పరిసరాలకు చెందిన కొందరు యువకులు బైక్‌ రేసింగ్‌ల కోసం ప్రత్యేకంగా ఆర్‌ఎక్స్‌ యమహా వాహనాలను తయారు చేసుంచుకుని ముళబాగల్‌ బైపాస్‌లో రేసింగ్‌లకు పాల్పడుతున్నారు. రేసింగ్‌ సందర్భంగా జరిగిన ప్రమాదాల్లో ఇప్పటికే పలువురు యువకులు తీవ్రంగా గాయపడగా మరికొందరు మృత్యువు పాలయ్యారు. రేసింగ్‌కు పాల్పడుతున్న విషయం తెలిసినా తల్లిదండ్రులు పిల్లలను వారించకుండా బైక్‌లు కొనిస్తుండడం ప్రాణాల మీదకు తెస్తోంది.