రేణిగుంట చెక్‌పోస్టులో చెలరేగిన వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌

Published: Sunday September 02, 2018
 పసుపులేటి విజయభాస్కర్‌ రవాణాశాఖలో మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎంవీఐ). ఆయన జీతం తక్కువే. కానీ చెక్‌పోస్టులో ‘అక్రమ’ రవాణాకు రైట్‌..రైట్‌ అని, రూ.కోట్లు వెనకేసుకున్నారు. చెక్‌పోస్టులో ఒకసారి విజయభాస్కర్‌ పట్టుబడ్డారు. అయినా, ఆయనపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆయన పుట్టిపెరిగిన కడప జిల్లాలో, ఉద్యోగం చేస్తున్న చిత్తూరు జిల్లాలో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. మార్కెట్‌ విలువ ప్రకారం రూ.వంద కోట్ల విలువైన ఆస్తులు విజయ్‌భాస్కర్‌ సంపాదించినట్టు గుర్తించారు.. కడప జిల్లా నందలూరు మండలం శేషమాంబపురానికి చెందిన విజయభాస్కర్‌, ప్రస్తుతం రేణిగుంట చెక్‌పోస్టులో ఎంవీఐగా పనిచేస్తున్నారు.
 
శనివారం ఆయన ఇంటితోపాటు, కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లలో కలిపి.. తిరుపతిలో నాలుగు, చంద్రగిరిలో రెండు, చిత్తూరులో ఒకటి, అనంతపురంలో ఒకటి, చెన్నైలో ఒకటి, బెంగళూరులో నాలుగు ప్రదేశాల్లోనూ, రేణిగుంట చెక్‌పో్‌స్టలోనూ ఏకకాలంలో తనిఖీ జరిపారు. తిరుపతి, బంగారుపాళ్యంలోని రెండు ఇళ్లకు తాళాలు వేసి ఉండటంతో.. అక్కడ తనిఖీలు ఆగాయి. తిరుపతి పద్మావతి పురంలో ఉంటున్న విజయభాస్కర్‌కు సన్నిహితురాలు ధనలక్ష్మి ఇంట్లో ఏసీబీ అదనపు ఎస్పీలు తిరుమలేశ్వరరెడ్డి, రమాదేవి బృందం ఉదయం నుంచి సాయంత్రం వరకు సోదాలు చేశారు. ఈ తనిఖీల సందర్భంగా ప్రభుత్వ విలువ ప్రకారం రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ ఆస్తులు మార్కెట్‌ విలువ ప్రకారం సుమారు రూ.100 కోట్లు ఉంటాయని ఏసీబీ అధికారుల అంచనా. ఇంకా రెండు బ్యాంకు లాకర్లు తెరవాల్సి ఉంది.
 
బెంగళూరులో వ్యాపారాలు
బెంగళూరులోని రెండు ప్రముఖ గార్మెంట్‌ కంపెనీల్లో విజయభాస్కర్‌కు భాగస్వామ్యం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. భార్య, సన్నిహితురాలితోపాటు బంధువుల పేరున ఆస్తుల పత్రాలు భారీఎత్తున లభ్యమయ్యాయి. ఇంకా.. ఈ తనిఖీల్లో 360 గ్రాముల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, రూ.2.7 లక్షల నగదు, రూ.1.8 కోట్ల విలువైన ప్రామిసరీ నోట్లు, చెక్కులు (రుణగ్రహీతలు రాసిచ్చినవి), రూ.79 లక్షలకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, మూడుకార్లు, రెండు స్కూటర్లు, విదేశీ మద్యం స్వాధీనం చేసుకొన్నారు.
 
వీఆర్‌ఎస్‌ ఎత్తువేసి..
రేణిగుంట చెక్‌పో్‌స్టలో విజయభాస్కర్‌కు మోనార్క్‌ అని పేరు. శని, ఆదివారాల్లో రూ.5 లక్షలు లేనిదే ఇంటిముఖం పట్టరట! ముఖ్యంగా తమిళనాడు బస్సుల నెలవారీ మామూళ్లు, ఆవులు తరలించే వాహనదారులు ఇచ్చే మామూళ్లుతో అడ్డగోలుగా సంపాదించేశారని చెబుతారు. అలా వచ్చిన డబ్బులతో భారీగా వడ్డీ వ్యాపారం చేశారు. ఈ క్రమంలో విజయభాస్కర్‌ 2011లో ఓ టీవీ చానల్‌ చేసిన స్టింగ్‌ ఆపరేషన్‌లో అడ్డంగా దొరికిపోయారు. ఆయనపై శాఖపరమైన విచారణ జరిపి, ఆర్‌సీవో కేసు నమోదుచేశారు. అయితే, పెద్దల అండతో బయటపడి, ప్రస్తుతం అదే చెక్‌పోస్టులో ఎంవీఐగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మూడు నెలల క్రితం రేణిగుంట చెక్‌పోస్టులో ఏసీబీ అధికారులు తనిఖీలు జరిపి..రూ.1.10లక్షల అక్రమార్జనను స్వాధీనం చేసుకొన్నారు.