బాలికపై అత్యాచారం నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు

Published: Monday September 10, 2018

రాచర్ల(ప్రకాశం జిల్లా): కొమరోలు మండలం చినగానిపల్లె గ్రామంలోని ఓ బాలిక (13)పై అదే గ్రామానికి చెందిన మీనిగ రంగస్వామి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన గిరిజన బాలిక స్థానికంగా ఉన్న పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. ఆరోగ్యం సరిగా లేక కొద్ది రోజులుగా ఇంటి వద్ద ఉన్న ఆమెపై రంగస్వామి కన్నేశాడు. శనివారం ఒంటరిగా ఉన్న బాలిక వద్దకు వెళ్లి మీ అమ్మ పిలుస్తుందని చెప్పి గ్రామ శివారుకు తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఆ మేరకు బాలిక తల్లి శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గిద్దలూరు సీఐ శ్రీ రామ్‌ గ్రామానికి వెళ్లి విచారించారు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టం, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. మార్కాపురం డీఎస్పీ రామాంజనేయులు దర్యాప్తు చేస్తున్నారు.