వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని.. భార్యను కడతేర్చాడు

Published: Monday September 17, 2018
భార్యకు అనారోగ్యం చేసిందని పర స్త్రీపై వ్యామోహం పెంచుకున్నాడు.. ఐదేళ్లుగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు.. ఈ క్రమంలో కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు.. దీనిపై నిలదీసిందని కోపోద్రోక్తుడై జీవిత భాగస్వామిని కత్తితో నరికి కడతేర్చాడు.. మండలంలోని కోరాపల్లి పంచాయతీ కేంద్రంలో శనివారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు అందించిన వివరాల ప్రకారం...
 
 
కోరాపల్లి గ్రామానికి చెందిన కోరాబు లక్షీనాయుడు (40)కు, సొలభం పంచాయతీ కొత్తకొండలు గ్రామానికి చెందిన జానకమ్మతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఐదేళ్ల క్రితం జానకమ్మ అనారోగ్యానికి గురికావడంతో కాలు, చేయి పడిపోయాయి. దీంతో లక్ష్మీనాయుడు కోరాపల్లి గ్రామానికి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో భార్యాపిల్లలను పట్టించుకోవడం మానేశాడు. దీనిపై లక్ష్మీనాయుడ్ని భార్య జానకమ్మ నిలదీస్తుండడంతో తచరూ గొడవలు జరిగేవి. ఈ విషయమై శనివారం సాయంత్రం భార్యభర్తల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో లక్ష్మీనాయుడు కోపోద్రోక్డుడై ఇంటిలో ఉన్న కత్తితో జానకమ్మను దారుణంగా మెడపై మూడు చోట్ల నరికి హతమార్చాడు.
 
విషయం తెలిగానే జానకమ్మ సోదరులు మత్స్యకొండబాబు, పెద్దబ్బాయి వచ్చి భోరున విలపించారు. సంఘటనపై ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వెంకటవిజయకుమార్‌ కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ రామారావు, సీఐ వెంకట విజయకుమార్‌ సంఘటనా స్ధలానికి చేరుకొని మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. హతుడు లక్ష్మీనాయుడు పరారీలో ఉన్నాడు. కాగా, జానకమ్మ మృతితో ఆమె ముగ్గురు పిల్లలు మాతృ ప్రేమకు దూరమయ్యారని కుటుంబీకులు, గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.