దండం పెట్టినా ప్రసవానికి ముందుకురాని జీజీహెచ్‌

Published: Wednesday November 21, 2018
 రోజం తా పడిగాపులు పడినా, దండాలు పెట్టి వేడుకొన్నా కనికరించలేదు. చివరకు చేసేది లేక మరో ఆస్పత్రికి తీసుకెళ్లి, ప్రసవం చేయించాల్సి వచ్చింది. తాజా ఘటనతో జీజీహెచ్‌ మరింతగా విమర్శలకు గురి అవుతోంది. బాధితురాలి కథనం ప్రకారం, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎస్టీ కాలనీకి చెందిన మల్లా తిరుపతమ్మకు మంగళవారం ఉదయం నొప్పులు ప్రారంభమయ్యాయి. రక్తహీనతతో బాధపడుతుండటంతో ఆశావర్కర్లు ఆమెను గుంటూరు జీజీహెచ్‌కు పంపించారు. ఉదయం పది గంటలకు వెళ్లినవారు, సాయంత్రం ఆరు దాకా ఉన్నా.. సిబ్బంది పట్టించుకోలేదు. బెడ్లు ఖాళీ లేవు అని ఒకసారి, లోపల వైద్యులు బిజీగా ఉన్నారని మరోసారి చెబుతూ.. కాలం వెళ్లబుచ్చారు. దీంతో రోజంతా తిరుపతమ్మ ఆస్పత్రి ఆవరణలో నొప్పులు పడుతూనే ఉంది. బిడ్డ నొప్పులు తట్టుకోలేక పోతోంది.. కాన్పు చేయండమ్మా అని ప్రాధేయపడ్డ బంధువులపై సిబ్బంది కన్నెర్ర చేశారు.
 
ఇక వీలు కాని పరిస్థితుల్లో తిరుపతమ్మను ఆటోలో ప్రత్తిపాడు వైద్యశాలకు తీసుకువెళ్లారు. అక్కడా ఆమె మరింత నరకం చవిచూసింది. వైద్యులు లేరు.. తిరిగి జీజీహెచ్‌కే తీసుకెళ్లండని తొలుత సిబ్బంది అన్నారు. దానికోసం 108ని సిద్ధం చేస్తుండగానే.. ఆమెకు నొప్పులు బాగా పెరిగిపోయాయి. దీంతో కాన్పు చేసేందుకు స్టాఫ్‌ నర్సులు ప్రయత్నం చేశారు. అయితే బిడ్డ అడ్డం తిరగటంతో వారూ ఒక దశలో చేతులు ఎత్తేశారు. 108లో గుంటూరుకు తరలించాల్సిందేనని నిర్ణయించుకొన్నారు. ఇంతలో బిడ్డ తల బయటకు వచ్చింది. దేవునిపై భారం వేసి స్టా్‌ఫ్‌ నర్సులే ఎట్టకేలకు ప్రసవం పూర్తిచేశారు. తలకు మూడు పేగులు అడ్డం పడటం వలన కొంత సమస్య తలెత్తినా.. మొత్తం మీద తల్లి, బిడ్డ క్షేమంగా బయటపడ్డారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరిగి జీజీహెచ్‌కు తిరుపతమ్మను తరలించారు.