ఆయిల్‌ చౌర్యంలో భారీ మామూళ్లు

Published: Thursday November 29, 2018
 చేతికి ఆయిల్‌ అంటితే జిడ్డుగా, ఇబ్బందిగా ఉంటుందేమోగానీ, ఆయిల్‌ మాఫియాకు వంతపాడితే వచ్చే మామూళ్లు మాత్రం పోలీసులకు హాయిగోలుపుతున్నాయి. కోస్తా ప్రాంతంలో ముడిచము రు దొంగలకు సహకరించి లక్షలాది రూపాయల మామూళ్లు తీసుకొంటున్న పోలీసుల బాగోతం బయటికి వస్తోంది. చము రు సంస్థల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంపై రాష్ట్ర పోలీసుశాఖ ఆరా తీయగా, పలు ఆసక్తికర విషయాలు బట్టబయలయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో చమురు దొంగలు క్రూడ్‌ ఆయిల్‌ కోసం పైపులైన్లకు రంధ్రాలు వేస్తుంటారు. వాటి నుంచి అక్రమంగా తోడేసిన ఆయిల్‌ను సుమద్ర తీరంలోని సరుగుడు తోటల్లో క్యాన్లలో దాచి రహస్యంగా విక్రయిస్తుంటారు. అయితే ఈ తతంగం మొత్తం స్థానిక పోలీసులకు తెలిసినా, చూసీచూడనట్లు వ్యవహరిస్తుంటారు.
 
అలా ఉంటే నెల మామూళ్లు భారీగా వచ్చి పడుతుంటాయి. తాజా గా వెలుగులోకి వచ్చిన డీఎస్పీ ఉదంతంపై ఆరా తీయగా, ప్రతినెలా ఆయన ఒక్కరికే రూ.10లక్షలు మామూళ్లు వెళుతున్నట్లు తెలిసింది. దీనిపై ఉన్నతస్థాయి వర్గాల విచారణలో పక్కా ఆధారాలు లభించినట్లు సమాచారం. ఇక, సీఐకు రూ.5 లక్షలు, ఎస్‌ఐకు రూ.2లక్షలు, స్టేషన్లకు రూ.10 లక్షల వరకూ మామూళ్లు ఇస్తున్నట్లు సమాచారం. అమలాపురం ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకుడు ఒకరు ఈ వ్యవహారాన్ని చక్కబెడుతున్నారని పోలీసు వర్గాలకు ఆధారాలు లభించాయి. తుక్కు వ్యాపారిగా స్థానికులకు తెలిసిన ఆయన, పోలీసులకు మామూళ్లు అందజేసి పనులు చక్కబెట్టడంలో దిట్ట అని గుర్తించారు. వీటిపై మరింత లోతుగా ఆరా తీయగా, వృద్ధ బ్రాహ్మణుడి పరారీ కోణం కొత్తగా వెలుగులోకి వచ్చింది.
 
యజమాని పరార్‌
అమలాపురం ప్రాంతంలో ఆయిల్‌ ట్యాంకర్లు లీజుకిచ్చిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఈ వ్యవహారంలో చిక్కుకున్నట్లు తెలిసింది. నిజాయితీగా వ్యాపారం చేయాలనుకున్న ఆయన, బండ్లు కొనుగోలు చేసి లీజుకిచ్చారు. అయితే వాటి డ్రైవర్లు కొందరు ఆయిల్‌ మాఫియా ఉచ్చులో పడ్డారు. అప్పుడప్పుడు దొంగ చమురు తరలించేందుకు ఈ ట్యాంకర్లను వినియోగించారు. దీంతో పోలీసులు ఆ వృద్ధ బ్రాహ్మణుడిని వేధించారు. ఆ వేధింపులు ఆపడానికి భారీగా డబ్బు డిమాండ్‌ చేశారు. అంత ఇచ్చుకోలేనని కొంత మేర ఇచ్చిన ఆయన, కేసులెందుకన్న భయంతో పరారైనట్లు తెలిసింది. దీనిపై స్థానికంగా రచ్చ అవడంతో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యా రు. ఆయన ఆచూకీ ఎట్టకేలకు గుర్తించారు. పోలీసులు ఆయన ద్వారా కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది.