పుట్టినరోజు పార్టీకి రావాలని ...ఇంటర్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
Published: Monday December 03, 2018

కొందరు మృగాళ్ల పశువాంఛకు మరో చిన్నారి బలైపోయింది. ఇంటర్ చదువుతున్నా మానసిక ఎదుగుదల సరిగ్గా లేని ఆమెపై ఓ కామాంధుడి కన్ను పడింది. రోజూ కాలేజీకి వెళ్లి వచ్చే ఆ బాలికను మాయమాటలతో మభ్యపెట్టడంతో పాటు మెల్లగా మందు తాగడం కూడా అలవాటు చేశాడు. అదును చూసి తన విశ్వరూపం ప్రదర్శించాడు. పుట్టినరోజు పార్టీ సాకుతో ఆమెను మద్యం మత్తులో ముంచి, మరో ఎనిమిది మందితో కలిసి ఆ చిన్నారిని కర్కశంగా చిదిమేశాడు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు... పట్టణంలో నివసించే ఓ కుటుంబానికి చెందిన బాలిక(17) ఇక్కడి ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతోంది. ఆమెకున్న మానసిక సమస్యను మిలటరీ మాజీ ఉద్యోగి సురేంద్ర(45) తనకు అనుకూలంగా మలచుకున్నాడు. మాయమాటలతో ఆమెకు మద్యం అలవాటు చేశాడు. పుట్టినరోజు పార్టీకి రావాలంటూ వారంక్రితం బాలికను ఇంటికి తీసుకెళ్లి పూటుగా తాగించాడు. మత్తులో ఉన్న ఆమెపై అతడితోపాటు, మరో 8మంది అత్యాచారానికి పాల్పడ్డారు. అప్పటినుంచి ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉంటోంది. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ప్రశ్నించడంతో విషయం బయటపడింది. దీనిపై వారు ఆదివారం సీఐ శ్రీరాంకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్లో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. అత్యాచారం జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలడంతో మిగిలిన వారికోసం గాలిస్తున్నారు. ఇదిలాఉండగా, బాధితురాలి మానసిక స్థితి సరిగ్గా లేదని తెలుసుకున్న మరికొందరు కూడా ఆమెకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నట్టు తెలిసింది. కాగా, నిందితుల్లో ఆమె సహచర విద్యార్థి ఒకరు కూడా ఉన్నట్లు సమాచారం.

Share this on your social network: