ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్య సంఘం వెల్లడి
Published: Wednesday January 09, 2019

విద్య, ఉపాధి పరంగా దేశంలోనే నవ్యాంధ్రప్రదేశ్ ఉన్నతస్థానంలో ఉందని.. విద్యార్థులు ఇకపై ఇంజనీరింగ్ విద్య కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని ఏపీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్(అపెక్మా) స్పష్టం చేసింది. ప్రభుత్వం కల్పిస్తున్న ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఉపయోగించుకోవాలని, తక్కువ ఫీజుతో ఇంజనీరింగ్‌ను అందించేంందుకు తగిన ప్రణాళికలు రూపొందించామని తెలిపింది. మంగళవారం ‘అపెక్మా’ అధ్యక్షులు డాక్టర్ శాంతి రాముడు, జనరల్ సెక్రెటరీ డాక్టర్ ఎన్. విజయభాస్కర చౌదరి, ట్రెజరర్ ఎంవీ కోటేశ్వరరావు, సెక్రెటరీ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఇంజనీరింగ్ విద్యపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 25న నెల్లూరు, 27న కర్నూలు, 28న కడప జిల్లాల్లో అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నట్లు స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని మొత్తం 279 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా తమ సంఘంలో ఉన్నాయన్నారు. సాంకేతిక విద్యలో నాణ్యతా ప్రమాణాలు తెచ్చేందుకు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ద్వారా చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగ అర్హతలు ఉండేలా సిద్ధం చేస్తామన్నారు. ఏటా ఎంసెట్‌లో 1.38లక్షల మంది విద్యార్థులు క్వాలిఫై అవుతున్నా, 30000-35000మంది డీమ్డ్, ప్రైవేట్ వర్సిటీల వైపు వెళ్తున్నారని తెలిపారు. ఇంజనీరింగ్ విద్యపై అవగాహన లేకపోవడం వల్లే వెళ్తున్నారని, వాస్తవానికి ఏపీలోనే మెరుగైన ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయని వివరించారు.

Share this on your social network: