విద్య కోర్సుల ఫీజులు పెరగనున్నాయి

రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్ తదితర వృత్తి విద్య కోర్సుల ఫీజులు పెరగనున్నాయి. ఇప్పటివరకు రూ.50 వేల లోపు వార్షిక ఫీజున్న కాలేజీల్లో 20%మేర, రూ.50 వేలకు పైగా వార్షిక ఫీజు ఉన్న కాలేజీల్లో 15% మేర ఫీజులు పెరగనున్నాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర వృత్తి, సాంకేతిక విద్య కాలేజీ యాజమాన్యాలతో శనివారం విశ్వేశ్వరయ్య భవన్‌లో ఫీజులు, ప్రవేశాల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ), తెలంగాణ ఉన్నత విద్యామండలి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఏఎఫ్‌ఆర్‌సీ చైర్మన్ జస్టిస్ స్వరూప్‌రెడ్డి, ఉన్నత విద్యా మండలి కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసరావు, ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాల సంఘం చైర్మన్ గౌతంరావు, కార్యదర్శి సునీల్, వివిధ కాలేజీ యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు.
ఫీజుల ఖరారులో ఆలస్యం, ఫీజుల ఖరారులో న్యాయవివాదం తలెత్తడంతో యాజమాన్యాలతో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో కొత్త ఫీజులను అమలు చేసేందుకు ప్రవేశాల కమిటీ చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు ఆయా కాలేజీల్లో ఉన్న ఫీజులపై 20%, 15% ఫీజులను పెంచేందుకు ఒకట్రెండు రోజుల సమయం పట్టనున్నందున.. జూలై 1వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన ఇంజనీరింగ్ వెబ్‌ఆప్షన్ల ప్రక్రియను మరో రెండు మూడ్రోజులు వాయిదా వేయాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. కాలేజీ వారీగా ఫీజులను ఖరారు చేశాకే, వెబ్ ఆప్షన్లను అందుబాటులో తేవాల్సి ఉంటుంది. దీంతో.. తాజా మార్పులను దృష్టిలో ఉంచుకుని వెబ్‌ఆప్షన్లను వాయిదా వేయనున్నారు.
రాష్ట్రంలో 2016–17 విద్యా సంవత్సరంలో 184 ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజులను ఏఎఫ్‌ఆర్‌సీ ఖరారు చేసింది. ఇందులో కనీస ఫీజు రూ.35 వేల లోపు ఉన్న కాలేజీలు 26 ఉన్నాయి. వాటితో కలుపుకొని రూ.50వేల లోపు ఫీజున్న కాలేజీల సంఖ్య 103. ప్రస్తుతం వాటన్నింటిలో 20% ఫీజులు పెరగనున్నాయి. మిగతా 81 కాలేజీల్లో 15% ఫీజులు పెంచనున్నారు. ఇంజనీరింగ్‌తోపాటు ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, లా తదితర వృత్తి విద్యాకోర్సుల ఫీజులు కూడా ఇదే నిష్పత్తిలో (20%, 15%) పెంచేందుకు అధికారులు ఓకే చెప్పారు. 2019–20 విద్యా సంవత్సరం నుంచి 2021–22 విద్యా సంవత్సరం వరకు మూడేళ్లపాటు అమలు చేయాల్సిన ఫీజుల కోసం 1,235 వృత్తి, సాంకేతిక విద్యా కాలేజీలు ప్రతిపాదనలను అందజేశాయి. ప్రస్తుతం వాటన్నింటిలో ఈ పెంపు అమలు కానుంది.
కొత్త ఫీజుల ఖరారు విషయంలో న్యాయ వివాదం నేపథ్యంలో ఫీజులను పెంచుతామని అధికారులు యాజమాన్యాల ముందు ప్రతిపాదన పెట్టగా కొన్ని కాలేజీలు 35–40% పెంచాలని డిమాండ్ చేశాయి. కానీ భారీగా పెంచితే వ్యతిరేకత ఎదురవుతుందన్న అభిప్రాయం కారణంగా తాజా మార్పులను ఏఎఫ్‌ఆర్‌సీ సూచించింది. దీనికి మెజారిటీ యాజమాన్యాలు అంగీకరిస్తూ సంతకాలు చేశాయి. వాస్తవానికి ఏఎఫ్‌ఆర్‌సీ చైర్మన్‌ను ముందుగా నియమించి ఉంటే, ఆయా కాలేజీల ఆదాయ వ్యయాలను బట్టి ఫీజులను ఖరారు చేసే వారు. నియామకంలో ఆలస్యం కావడం, ఫీజులను ఖరారు చేయకపోవడంతో ప్రవేశాలు మరింత జాప్యమయ్యే పరిస్థితి నెలకొనడంతో.. ఈ పెంపును అధికారులే ప్రతిపాదించారు. దీనికి కోర్టును ఆశ్రయించిన కాలేజీలు కూడా చాలా వరకు అంగీకరించాయని అధికారులు వెల్లడించారు. అంతేకాదు రాతపూర్వకంగా అంగీకారాన్ని తెలియజేశాయని పేర్కొన్నారు.

Share this on your social network: