సీటొచ్చినా.. అడ్మిషన్‌ వద్దన్నారు

Published: Thursday June 21, 2018
ఎంసెట్‌-ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ అడ్మిషన్ల ప్రక్రియలో అసాధారణ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఇంజనీరింగ్‌, బీ-ఫార్మసీ కోర్సుల్లో సీటు కేటాయించినా.. అడ్మిషన్‌ తీసుకునేందుకు విముఖత చూపుతున్నారు. ఎంసెట్‌ తొలిదశ కౌన్సెలింగ్‌లో సీటొచ్చినా దాదాపు 9 వేల మంది అభ్యర్థులు సంబంధిత కాలేజీల్లో జాయినింగ్‌ రిపోర్టు ఇచ్చేందుకు కూడా రాలేదు. ఆయా అభ్యర్థులు అందరూ తాము వెబ్‌లో ఆప్షన్‌ ఇచ్చుకున్న కాలేజీ, బ్రాంచ్‌లో సీట్‌ అలాట్‌ అయిన వారే కావడం గమనార్హం.
 
అయినా తమ ప్రాధాన్యంలో కాలేజీ/సీటు రాలేదంటూ వారు అడ్మిషన్‌ తీసుకోలేదు. రాష్ట్రంలో 30 ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌లతో పాటు బీ-ఫార్మసీ బ్రాంచ్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తొలివిడత ఎంసెట్‌-ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌కు సంబంధించి కన్వీనర్‌ కోటాలో మొత్తం 89,592 సీట్లు ఉన్నాయి. ఎంసెట్‌-2018లో మొత్తం 1.38 లక్షల మంది అర్హత సాధించారు. వెబ్‌ కౌన్సెలింగ్‌లో 66 వేల మంది ఆప్షన్లు ఇచ్చుకున్నారు. అయితే, వారిలో 60,943 మందికి సీట్లు కేటాయించారు. వీరిలో 52,006 మంది అభ్యర్థులే సంబంధిత ఇంజనీరింగ్‌ కాలేజీలో జాయినింగ్‌ రిపోర్టు ఇచ్చారు. అంటే, 8,937 మంది సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయలేదు.