అసిస్టెంట్ ప్రొఫెసర్స్ స్ర్కీనింగ్‌పై నిర్ణయం

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా నిర్వహించిన స్ర్కీనింగ్ టెస్ట్‌లో అభ్యర్థులు పొందిన మార్కులను.. విశ్వవిద్యాలయాల నోటిఫికేషన్ ఫేజ్‌లు, సబ్జెక్టుల వారీగా ఏపీపీఎస్సీ సిద్ధం చేస్తోంది. కటాఫ్ మార్కుల ప్రకారం తయారు చేస్తున్న అర్హుల జాబితాలను ఈ వారాంతంలోగా వర్సిటీలకు పంపేందుకు ఏపీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. మొత్తం 14 వర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1,110 సహాయ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసేందుకు వీలుగా వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసిన ఏపీపీఎస్సీ.. దరఖాస్తు చేసుకున్న 20 వేల మంది అభ్యర్థులకు స్ర్కీనింగ్ నిర్వహించి మార్కులను విడుదల చేసింది. అన్ని వర్సిటీల్లో కలిపి 64 సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహించగా.. అన్ని సబ్జెక్టుల్లో మార్కులను వెబ్‌సైట్లో పొందు పరిచింది. వర్సిటీలు కేటగిరీల వారీగా నిర్దేశించిన కటాఫ్ మార్కుల ప్రకారం స్ర్కీనింగ్ టెస్ట్‌లో అర్హులైన అభ్యర్థుల జాబితాలను ఏపీపీఎస్సీ సిద్ధం చేసింది. గత వారంలోనే ఆ పని పూర్తయినప్పటికీ, నోటిఫికేషన్ ఫేజ్ వారీగా విభజించి పంపాలని వర్సిటీలు కోరడంతో ఆ మేరకు జాబితాలను సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే అన్ని విశ్వవిద్యాలయాల వైస్‌చాన్సెలర్లతో సమావేశం నిర్వహించి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇంటర్వ్యూల నిర్వహణతో పాటు నియామక ప్రక్రియ షెడ్యూల్‌ను ఖరారు చేసి దిశానిర్దేశం చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. మరోపక్క.. ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్ ప్రక్రియను వాయిదా వేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌కమిషన్(యూజీసీ) లేఖ రాసినప్పటికీ.. రాష్ట్రంలో ఇంటర్వ్యూలను నిర్వహించడానికి ప్రతిబంధకం కాబోదని ఉన్నత విద్యా మండలి వర్గాలు పేర్కొన్నాయి

Share this on your social network: