మాంసానికి పెరుగుతున్న గిరాకీ

Published: Wednesday December 12, 2018
 à°ªà°²à±à°¨à°¾à°¡à±à°²à±‹ లేగ దూడల మాంసానికి గిరాకీ పెరుగుతోంది. గేదెలకు చెందిన దూడలు (మగ దున్నలు) రవాణాకు దాచేపల్లి కేంద్రంగా మారింది. కోడి, వేట మాంసం ధరలు అమాతంగా పెరగడంతో కార్మికులు, వ్యవసాయ కూలీలు, రోజువారీ కూలీలు దూడ మాంసంపై మక్కువ పెంచుకుంటున్నారు. పల్నాడులో పరిశ్రమలు, ముగ్గుమిల్లు, మైనింగ్‌ క్వారీలలో పనిచేసే కార్మికులు అధికంగా ఉన్నారు. కేజీ దూడ మాంసం రూ. వంద ఉండగా, వేట మాంసం రూ.400, కోడి రూ.250 ఉన్నది. పల్నాడు ప్రాంతంతో పాటు వాడపల్లి, దామరచర్ల ప్రాంతాలకు చెందిన కార్మికులు ఆదివారం వివిధ వాహనాలలో దాచేపల్లి మండలానికి చేరుకొని దూడ మాంసం కొనుగోలు చేసి వెళుతుంటారు.
 
వేట మాంసం గిరాకీ పెరగడంతో కొంత మంది వ్యాపారులు దూడ మాంసాన్ని వేట మాంసంలో కలిపి విక్రయిస్తున్నట్లు మాంసంప్రియులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా హోటళ్లలో ఈ కల్తీ అధికంగా ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్తీక మాసం ముగియడంతో మాంసం అమ్మకాలకు తెరలేచింది. జంతు ప్రేమికులు మాత్రం పశు సంపద గణనీయంగా తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.