మీ పాదముద్రలు చరిత్రలో నిలుస్తాయి

Published: Wednesday January 02, 2019
కొత్త రాష్ర్టానికి ప్రత్యేక హైకోర్టును ప్రారంభించుకోవడం చారిత్రక ఘట్టమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ఆయన తన ప్రసంగం ప్రారంభంలో స్థానికతను గుర్తుచేసేలా ‘దేశమును ప్రేమించుమన్నా. మంచియన్నది పంచుమన్నా. దేశమంటే మట్టి కాదోయ్‌. దేశమంటే మనుషులోయ్‌’ అనే గురజాడ వ్యాఖ్యలను ఉటంకించారు. తనకు మాతృభాషలోనే ప్రసంగించడం ఇష్టమని, కానీ తనది ఇక్కడ సుప్రీంకోర్టు సీజే జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ తరఫున ద్విపాత్రాభినయం (డ్యూయెల్‌ రోల్‌) కాబట్టి ఆంగ్ల్లంలో మాట్లాడాల్సి వస్తోందని చెప్పారు. బెజవాడ బార్‌ అసోసియేషన్‌లో ప్రాక్టీసుతో జీవితం ప్రారంభించిన రోజులను గుర్తుచేసుకున్నారు. ఈనెల 25కల్లా హైకోర్టు భవనం పూర్తవుతుందని ముఖ్యమంత్రి చెప్పారని, దాని ప్రారంభానికి వచ్చేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ‘‘ఇదో చారిత్రక కార్యక్రమం. రాష్ర్టానికి గర్వకారణమైన సందర్భం. సుదూర ఆలోచనలు, కలల సాకారంలో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు కీలక మలుపు అవుతుంది. 1954 జూలై 5à°¨ రాష్ట్ర హైకోర్టు గుంటూరులో మొట్టమొదటిసారిగా ఏర్పాటైంది. అనంతరం పునర్విభజనతో 1956 నవంబరు 1à°¨ హైదరాబాద్‌కు తరలివెళ్లింది. 62 సంవత్సరాల్లో మూడు ప్రదేశాలకు ఉన్నత న్యాయస్థానం మారింది’’ అని ఆయన వివరించారు.
 
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు దేశంలో పిన్న వయసు కలిగిన న్యాయస్థానం అని జస్టిస్‌ రమణ అన్నారు. అయినా సమర్థవంతంగా పనిచేసి దేశంలో ఉత్తమంగా నిలవాలని ఆకాంక్షించారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు ప్రజలకు న్యాయం చేయడం కోసం కృషి చేయాలన్నారు. ఎన్నో ఆశలు, స్ఫూర్తితో సాగే జీవనానికి... పరిమితమైన న్యాయం అందించడం సరిపోదని వ్యాఖ్యానించారు. సమాజంలో సవాళ్లు ఉన్నప్పుడే మరింత బలోపేతం అవుతామని అభిప్రాయపడ్డారు. ‘రోమ్‌ నగరం ప్రపంచంలో అందర్నీ ఆకర్షిస్తుంది. కానీ రోమ్‌ను ఒక్కరోజులో నిర్మించలేదు’ అని వ్యాఖ్యానించారు. ‘‘ఏపీకి ఇది కీలక ఘట్టం. మీ పాదముద్రలు చరిత్రలో మిగిలిపోతాయి’’ అని న్యాయమూర్తులు, న్యాయవాదులను ఉద్దేశించి అన్నారు. కొత్త రాష్ట్రంలో ప్రారంభ ఇబ్బందులుంటాయని, వాటిని అధిగమిస్తూ కష్టపడి పనిచేయాలని కోరారు.