ఏపీలో మోదీ దిష్టిబొమ్మల దహనానికి పిలుపు

Published: Friday January 04, 2019

అమరావతి: ఢిల్లీలో పత్యేక హోదా ఉద్యమకారులపై లాఠీచార్జ్‌కు నిరసనగా శుక్రవారం ఏపీ వ్యాప్తంగా ప్రధాని మోదీ దిష్టిబొమ్మల దహనానికి ప్రత్యేక హోదా సాధన సమితి, వామపక్షాలు పిలుపునిచ్చాయి. గురువారం ఢిల్లీ జంతర్‌ మంతర్‌ రోడ్డులో ప్రత్యేక హోదా సాధన సమితి, వామపక్షాలు, విద్యార్థి సంఘాల నేతృత్వంలో ధర్నా జరిగింది. సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌, ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం కార్యదర్శి మధు, ఆయా పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, ఆ పార్టీ నేత గిడుగు రుద్రరాజు హాజరయ్యారు. అయితే నిరసనకారులు పార్లమెంట్‌ను ముట్టడించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆందోళనకారులు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు బ్యారికేడ్లతో అడ్డుకొన్నారు. ఎలాంటి హెచ్చరికలు లేకుండా లాఠీచార్జి చేశారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. లాఠీచార్జి చేయడాన్ని సీఎం చంద్రబాబు, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌ కరత్‌, టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్‌, టీజీ వెంకటేశ్‌, చలసాని శ్రీనివాస్‌ ఖండించారు.