గోవిందరాజస్వామి గుడిలో 3 కిరీటాల చోరీ

Published: Monday February 04, 2019
భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం, ఇంటి దొంగల సహకారంతోనే తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో మూడు చిన్న కిరీటాల చోరీ జరిగిందని అధికారులు నిర్ధారించారు. ఆ కిరీటాలను దొంగ జేబులో పెట్టుకుని పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. ఆలయం నుంచి జేబులు తడుముకుంటూ పరుగున వెళ్తున్న ఒక అనుమానుతుడిని సీసీటీవీ ఫుటేజీలో గుర్తించారు. చోరీకి గురైన కిరీటాల బరువు 1,351గ్రాములని, వాటి విలువ రూ.40 లక్షలు ఉంటుందని టీటీడీ అధికారులు తెలిపారు.
 
టీటీడీ నిర్వహణలో ఉన్న ప్రధాన ఆలయాల్లో తిరుపతి గోవిందరాజస్వామి గుడి ఒకటి. ఈ ఆలయ ప్రాంగణంలో సుమారు 18దాకా ఉపాలయాలున్నాయి. వాటిలో ఒకటైన కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఉత్సవమూర్తులకు వినియోగించే మూడు బంగారు కిరీటాలు శనివారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయాయి. దీనిపై అర్చకులు సమాచారం ఇవ్వడంతో ఆలయాధికారులు రాత్రి 9.40 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్బన్‌ ఎస్పీ అన్బురాజన్‌, టీటీడీ చీఫ్‌ విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ గోపీనాధ్‌ జెట్టీ సారథ్యంలో వేర్వేరుగా దర్యాప్తు ప్రారంభమైంది. కేసు దర్యాప్తు కోసం 8 ప్రత్యేక బృందాలను ఎస్పీ ఏర్పాటు చేశారు. ఓ బృందం ఆలయ సిబ్బందిని విచారించే పనిలో నిమగ్నం కాగా మరోబృందం ఆలయంలో ఏర్పాటు చేసిన 13 సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించాయి. దీని ఆధారంగా ఆదివారం మధ్యాహ్నానికి నిందితుడిని గుర్తించారు. శనివారం సాయంత్రం 5.15గంటలకు నిందితుడిగా భావిస్తున్న వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించడం, 5.35కు హడావిడిగా బయట కు పోవడాన్ని గుర్తించారు. ఈ సమయంలో ఉత్సవమూర్తుల వద్ద అర్చకులు, ఇతర సిబ్బంది లేకపోవడంతో సులువుగా చోరీ జరిగినట్టు భావిస్తున్నారు. సదరు వ్యక్తి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే ఇప్పటికే ఆధారాలు లభించాయని రెండు మూడు రోజుల్లోనే నిందితులను పట్టుకుంటామని టీటీడీ ఈవో ఏకే సింఘాల్‌ చెప్పారు.
 
కల్యాణ వేంకటేశ్వరస్వామి ఉపాలయం వద్ద ముగ్గురు అర్చకులు విధులు నిర్వర్తిస్తారు. సాయం త్రం 5గంటలకు షిఫ్ట్‌ మారుతుంది. శనివారం సాయంత్రం 5గంటలకు విధులకు రావాల్సిన అర్చకుల్లో ఒకరు 5.10గంటలకు వచ్చారు. అతనికి విగ్రహాలను అప్పగించి అప్పటిదాకా ఉన్నవారు వెళ్లిపోయారు. బాధ్యత తీసుకున్న అర్చకుడు అక్కడ ఉండకుండా ఎటో వెళ్లిపోయారు. మరో అర్చకుడు 5.30కు డ్యూటీకి వచ్చారు. అతనూ ఉపాలయం వద్ద ఉండకుండా ఎదురుగా ఉన్న మరో ఆలయం వద్దకు వెళ్లిపోయారు. ఇక మూడో అర్చకుడు డ్యూటీకే రాలేదు. ఆయన గోదాదేవి ఉపాలయం వద్ద విధులు నిర్వర్తించినట్టు సమాచారం. రెండో అర్చకుడు ఎదురుగా ఉన్న ఉపాలయం వద్దకు వెళుతుండగా నిందితుడు లోనికి ప్రవేశిస్తున్న దృశ్యం సీసీ కెమెరాల్లో రికార్డైంది. నిందితునికి రెండో అర్చకుడు ఏవో సంజ్ఞలు చేసినట్టు గుర్తించారని, దీని ఆధారంగానే చోరీకి ఆలయ సిబ్బంది సహకారముందన్న నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం.