వైసీపీ దుష్ప్రచారంచేస్తోంది: చింతమనేని

Published: Monday February 25, 2019
రాష్ట్ర విభజన చేసిన వారితో కలిసి 2.30 నిముషాల వీడియోని ఎడిటింగ్‌ చేసి, తనను ఓడించాలని వైసీపీ నాయకులు చూస్తున్నారని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఆరోపించారు. తాను దళితులను కించపరుస్తూ, వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరగటంపై స్పందిస్తూ ప్రభాకర్‌ ఆదివారం విజయవాడలోని స్టేట్‌ గెస్ట్‌హౌ్‌సలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. వైసీపీ నాయకులు దళితులను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని, తాను దళితులను కించపరిచే వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. à°† విధంగా మాట్లాడితే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు.
 
à°ˆ వ్యవహారంలో తాను తప్పు లేకపోయినా క్షమాపణ కోరుతున్నానన్నారు. వైఎస్‌ జగన్‌కు దమ్ముంటే తనపై పోటీచేసి గెలవాలని సవాల్‌ విసిరారు. ‘జగన్‌ నా నియోజకవర్గానికి వచ్చి చూస్తే, నేను ఏవిధంగా నియోజకవర్గంలో అభివృద్ధి చేశానో, దళితవర్గాలతో ఏవిధంగా కలిసి ఉంటానో తెలుస్తుంది’ అని చెప్పారు. దెందులూరు నియోజకవర్గం అభివృద్ధికి మారుపేరు అని ప్రభాకర్‌ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చాలా పోరాటాలు చేశానని అందుకే కొన్ని కేసులు పెట్టారని, ప్రస్తుతం మూడు కేసులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గ ఎమ్మెల్యేపై లేని ఆరోపణలు తనపై వస్తున్నాయన్నారు.
 
వైసీపీ నాయకులు తనను ఎదుర్కోలేక నవంబర్‌లో జరిగిన దానిని వక్రీకరించి వీడియో విడుదల చేశారని, కేవలం తనను దళిత వ్యతిరేకిగా చూపాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కొన్ని పత్రికలపై ప్రెస్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తానని చింతమనేని చెప్పారు. జగన్‌ గెలుస్తారని కేటీఆర్‌ ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్‌ చెబుతున్న చిలక జోస్యం ఎవరు నమ్మరని ప్రభాకర్‌ అన్నారు. మోదీ, కేసీఆర్‌, జగన్‌ కలసి ఏపీని ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.