బాబులా నా కొడుకు ముఖ్యమంత్రి కావాలనను

Published: Monday February 25, 2019
 ‘‘వైసీపీ అధినేత జగన్‌లాగా 30 ఏళ్లు నేనే ముఖ్యమంత్రి కావాలని అనడం లేదు. సీఎం చంద్రబాబులాగా నేను.. మా అబ్బాయి సీఎం కావాలనే కోరిక లేదు. ప్రజల జీవితాల్లో మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చాను. ముఖ్యమంత్రి పదవి ఇస్తారా.. ప్రతిపక్షంలో కూర్చోబెడతారా? మీ ఇష్టం. మీ జీవితాల్లో మార్పు తెచ్చేవరకు నా పోరాటం ఆగదు’’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. కర్నూలు జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం కర్నూలు నగరానికి చేరుకున్నారు. అమరావతి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న పవన్‌కు స్థానిక నాయకులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి కర్నూలు నగరానికి వచ్చారు. సి.క్యాంప్‌ సెంటర్‌ నుంచి కొండారెడ్డి బురుజు వరకు రోడ్‌షో నిర్వహించారు.
 
కొండారెడ్డి బురుజు దగ్గర ఏర్పాటు చేసిన సభలో పవన్‌ ప్రసంగించారు. ‘‘కొండారెడ్డి బురుజు సాక్షిగా చెబుతున్నా. జనసేన లేకుండా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఉండవు. ఒకే వ్యక్తికి అధికారం ఇస్తే పాలన అస్తవ్యస్తంగా మారుతుంది. అందుకే సంకీర్ణ ప్రభుత్వాల వైపు దృష్టి పెట్టాలి’’ అని సూచించారు. అధికార, ప్రతిపక్షాల మేనిఫెస్టోలు చూస్తుంటే సిగ్గేస్తోందని, రాష్ట్ర బడ్జెట్‌ రూ.2 లక్షల కోట్లు కాగా, ఇస్తున్న హామీలు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల కోట్ల వరకు ఉంటున్నాయని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు, ప్రతిపక్షనేత జగన్‌లాగా దిగుజారి అబద్ధాలు చెప్పనని తెలిపారు.