రైల్వేజోన్‌ ఏర్పాటుపై బీజేపీలో పెదవి విరుపు

Published: Friday March 01, 2019
 à°“ వైపు పాక్‌తో మినీ యుద్ధం... మరోవైపు ఏపీకి రైల్వేజోన్‌... మంచి ఊపుమీద కనిపించిన రాష్ట్ర బీజేపీ ఒక్కరోజులోనే నీరసించింది. విశాఖ డివిజన్‌ను రెండు ముక్కలు చేయడం, ఆదాయ మార్గాన్ని అటువైపు చేర్చడంపై ప్రజల్లో వస్తున్న తీవ్ర వ్యతిరేకతతో à°† పార్టీ ముఖ్యులు డీలాపడిపోయారు. ప్రత్యేకహోదా విషయంలో స్పష్టంగా మాట్లాడని ఏపీ బీజేపీ నేతలు రాష్ట్రానికి రైల్వేజోన్‌ వచ్చితీరుతుందని పలు సందర్భాల్లో ధీమాగా మాట్లాడారు. వారంతా ఇటీవల ఢిల్లీకి వెళ్లి కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు వినతిపత్రం సమర్పించడం, à°† తర్వాత సీఎం చంద్రబాబు కూడా లేఖ రాయడం, రైల్వేజోన్‌ ప్రకటన రావడం వరుసగా జరిగిపోయాయి. దీంతో ఏపీలో బీజేపీతో పాటు ప్రతిపక్ష వైసీపీ కూడా అక్కడక్కడ సంబరాలు చేసుకుంది.
 
తీరా అసలు విషయం తెలిశాక ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత చూసి ఇలా అయిందేమిటంటూ బీజేపీ నేతలు ముక్కున వేలేసుకొంటున్నారు. బ్రిటిష్‌ కాలంలో ఏర్పాటై, ఇటీవలై 125 వసంతాలు పూర్తిచేసుకున్న వాల్తేరు డివిజన్‌ను ఎలా ముక్కలు చేస్తారని ఉత్తరాంధ్రవాసులు మండిపడుతున్నారు. అసలు పేరే లేకుండా చేయడం ఏమిటని నిలదీస్తున్నారు. దీనికితోడు ఆదాయం విషయంలోనూ మోదీ సర్కారు తీరని అన్యాయం చేసిందని సీఎం చంద్రబాబు, మంత్రులు, టీడీపీ, ఇతర పార్టీల నేతలు ఆరోపణలు చేశారు. ఆదాయ వనరులున్న ప్రాంతాన్ని ఏపీలో లేకుండా రాయగడలో కలిపేందుకు రాష్ట్రానికి తలమానికంగా ఉన్న విశాఖ నగరాన్ని ఎలా విభజిస్తారని నిలదీశారు. దీనిపై ఏపీ బీజేపీ నేతలు మాటలదాడి చేసినా లోపల మాత్రం కేంద్రం నిర్ణయం మనకు కొంతైనా కలిసొచ్చేలా లేనట్లుందని పెదవి విరుస్తున్నారు. అయితే విశాఖలో జరిగే మోదీ సభ తర్వాత కార్యకర్తల్లో మరింత ఉత్సాహం వస్తుందని కొందరు పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.