అన్ని ఆర్టీసీ బస్సుల్లోనూ సీసీ కెమెరాలు

Published: Thursday April 25, 2019
‘మహిళల్ని గౌరవించడం మన సంప్రదాయం... వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం’ లాంటి నినాదాలు ఆర్టీసీ బస్సెక్కిన ప్రతి ఒక్కరికీ కనిపిస్తాయి. ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తూ ‘ఆర్టీసీ ప్రయాణం సురక్షితం’ అంటూ ముందుకెళ్తున్న ఆర్టీసీ.. అందులో మహిళల రక్షణకు మరిన్ని మెరుగైన చర్యలు చేపడుతోంది. ఇప్పటికే 186 బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన సంస్థ.. దశలవారీగా అన్ని బస్సుల్లోనూ వాటిని ఏర్పాటు చేయనున్నట్టు ఉన్నతాధికారులు చెబుతున్నారు. అలాగే మహిళ భద్రత కోసం డ్రైవర్‌ సీటు వెనుక ‘ప్యానిక్‌ బటన్‌’ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఒక్కోదశలో రూ.16 కోట్లు ఖర్చు చేస్తూ మూడు విడతల్లో రూ.48 కోట్లతో అన్ని బస్సుల్లోనూ నిఘా కెమెరాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. దీంతో మహిళా ప్రయాణికులతోపాటు లగేజీ విషయంలోనూ భద్రత ఉంటుందని చెప్పారు. ఇప్పటికే వెన్నెల స్లీపర్‌, అమరావతి, గరుడ, ఇంద్ర, నైట్‌ రైడర్‌, ఎక్స్‌ప్రెస్‌ తదితర బస్సుల్లో నిఘా నేత్రాలను ఆర్టీసీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.