మన రాష్ట్రానికి నీటివాటాలో అన్యాయం

Published: Saturday May 04, 2019
రాష్ట్ర విభజన చట్టంలో గోదావరి నదీ జలాల యాజమాన్య సంస్థ (జీఆర్‌ఎంబీ) కార్యాలయాన్ని హైదరాబాద్‌లో.. కృష్ణా నదీ యాజమాన్య సంస్థ (కేఆర్‌ఎంబీ)ను నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోనూ ఏర్పాటు చేయాలని స్పష్టంగా పేర్కొన్నారు. కానీ ఐదేళ్లు కావస్తున్నా ఇప్పటిదాకా కృష్ణా బోర్డు అమరావతికి తరలిరాలేదు. గోదావరి బోర్డుతో పాటు దానినీ కేంద్రం హైదరాబాద్‌లోనే కొనసాగిస్తోంది. విజయవాడలో కార్యకలాపాలను నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ సిద్ధం చేసిన ఆఫీసు కార్యాలయాన్ని కేఆర్‌ఎంబీ చైర్మన్‌, ఇతర ఉన్నతాధికారులంతా పరిశీలించారు.
 
పార్కింగ్‌ సదుపాయం కల్పించాలని కోరారు. à°† సమస్యను కూడా జలవనరుల శాఖ పరిష్కరించింది. అయినా తరలిరావడానికి బోర్డు ఉన్నతాధికారులు కుంటి సాకులు చెబుతున్నారు. హైదరాబాద్‌ను వీడి అమరావతికి వస్తే తమ ఆధిపత్యానికి గండిపడుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే బోర్డు ప్రధాన కార్యాలయాన్ని విజయవాడకు బదలాయించేందుకు అంగీకరించడం లేదు. ఫలితంగా రాష్ట్రానికి కృష్ణా జలాల విడుదలలో బోర్డు స్పష్టమైన వైఖరిని అవలంబించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
కృష్ణా నదీ జలాల కేటాయింపులు, వాడకంలోనూ తెలంగాణ బుకాయింపులకు బోర్డు తలూపుతోందని నిపుణులు ఆక్షేపిస్తున్నారు. నాగార్జున సాగర్‌ కాలువలకు నీటివిడుదల విషయంలోనూ ఉదాశీనంగా ఉంటోందని విమర్శిస్తున్నారు. భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న నాగార్జున సాగర్‌ కాలువలపైనా తెలంగాణ ప్రభుత్వమే పెత్తనం చేస్తున్నా.. బోర్డు స్వతంత్రంగా వ్యవహరించకపోవడాన్ని నిలదీస్తున్నారు.
 
మొత్తం కృష్ణా జలాల పంపిణీ, నిర్వహణను బోర్డు తన అధీనంలోకి తీసుకోవాలని రాష్ట్ర విభజన చట్టం చెబుతోంది. కానీ కేఆర్‌ఎంబీ అలాంటి చొరవే చూపడంలేదు. యాజమాన్య నిర్వహణ బాధ్యతను తెలంగాణకే అప్పగించేసింది. టెలీమెట్రీలను ఏర్పాటు చేసినా.. తూతూ మంత్రంగానే కృష్ణా నదీ జలాల వినియోగం లెక్కలుంటున్నాయి. చిన్న తరహా నీటి వనరుల వినియోగంపైనా బోర్డు సహేతుకంగా వ్యవహరించడం లేదు. అది విజయవాడకు మకాం మారిస్తేనే కృష్ణా నదీ జలాల విషయంలో ఆంధ్రకు న్యాయం జరుగుతుందని.. అందాకా మనకు అన్యాయమేనని అంటున్నారు.