స్మార్ట్‌ ఫోన్లు, వైబ్‌సైట్ల నుంచే హల్‌చల్‌

Published: Monday May 06, 2019
సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి స్మార్ట్‌ ఫోన్‌ల ఆధారంగా క్రికెట్‌ బెట్టింగులకు పాల్పడుతున్న ముఠా గుట్టును గుంటూరు పోలీసులు రట్టు చేశారు. ఇప్పటి వరకు క్రికెట్‌ బెట్టింగ్‌ అనగానే కమ్యూనికేటర్‌ బాక్సులు, పెద్ద ఎత్తున సెల్‌ఫోన్లు వంటివి దర్శనం ఇచ్చేవి. అయితే, తాజాగా వెబ్‌ సైట్స్‌ నుంచే యథేచ్ఛగా బెట్టింగ్‌ కార్యకలాపాలు సాగిస్తున్నా యి. ఈ విధంగా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలతో లింకు ఉన్న ఓ ముఠా నెట్‌వర్క్‌ను గుంటూరు రూరల్‌ పోలీసులు ఛేదించారు. రూరల్‌ ఎస్పీ రాజశేఖర్‌బాబు నేతృత్వంలో బెట్టింగ్స్‌పై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ సీఐ విజయ్‌కృష్ణ, సత్తెనపల్లి పోలీసులు నిర్వహించిన ఆపరేషన్‌లో ఈ ముఠా గుట్టు రట్టయింది.
 
ప్రస్తుతం హైదరాబాద్‌ ఎస్‌ఆర్‌ నగర్‌లో ఉంటున్న గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం బీరవల్లిపాయ గ్రామానికి చెందిన పసుపులేటి నాగార్జునతో పాటు మధ్యప్రదేశ్‌లోని సాత్నాకు చెందిన అవదీష్‌ ప్రతా్‌పసింగ్‌ అలియాస్‌ కబీర్‌, మధ్యప్రదేశ్‌లోని దీన్‌ దయాళ్‌ దామ్‌ పరిధిలోని పడరా రేవా ప్రాంతాలకు చెందిన అంకిత్‌ ద్వివేది, దివ్యాంషు సింగ్‌లను అరెస్టు చేశారు. వీరిలో నాగార్జున నుంచి రూ.22.16 లక్షల నగదు సీజ్‌ చేశారు. అలాగే, 21 సెల్‌ఫోన్లు, లాప్‌టాప్‌, వందలాది సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరులో రూరల్‌ ఎస్పీ రాజశేఖర్‌బాబు నిందితులను ఆదివారం మీడియా ఎదుట హాజరుపర్చి వివరాలు వెల్లడించారు.
 
నాగార్జున ఎంబీఏ పూర్తి చేశాడు. హైదరాబాద్‌లో హాస్టల్‌లో ఉంటూ ఆన్‌లైన్‌లో మధ్యప్రదేశ్‌కు చెందిన ముగ్గురితో పరిచయం ఏర్పర్చుకున్నాడు. వారిలో ప్రతా్‌పసింగ్‌, ద్వివేది బీటెక్‌ చదవగా దివ్యాంషు ఏజీబీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కొల్‌కతాకు చెందిన ఓ వ్యక్తి ఈ వెబ్‌సైట్స్‌ను క్రియేట్‌ చేశాడు. ఆయన నుంచి మధ్యప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు లింక్‌ తీసుకున్నాడు. వారి నుంచి నాగార్జున లింకు తీసుకుని ఆన్‌లైన్‌లో క్రికెట్‌ బెట్టింగ్స్‌ నిర్వహిస్తున్నాడు. కేవలం 40 రోజుల వ్యవధిలో 226 మందిని సభ్యులుగా చేర్చుకున్నాడు. ఇప్పటి వరకు నాగార్జున రూ.22.16 లక్షలు సంపాదించాడు. బెట్టింగ్స్‌లో వచ్చిన మొత్తంలో అది కేవలం 30ు మాత్రమే... తనకు వచ్చిన లాభంలో 70ు మధ్యప్రదేశ్‌కు చెందిన వారికి వాటా ఇవ్వాలి.