రాష్ట్రాన్ని నిలువునా వణికిస్తున్న నాలుగేళ్లనాటి మృత్యు గాలులు

Published: Saturday May 25, 2019
ఒక ప్రయాణికుడు బస్సు ఎక్కాడు. కుడి వైపు సీటులో కూర్చొన్నాడు. బస్సు కదిలిన కొద్దిసేపటికే అటు ఎండ పెరిగింది. సరేనని, ఎడమ వైపు సీటుకు మారాడు. మొదట బాగానే ఉంది. ప్రయాణం సాగుతున్నకొద్ది వేడిగాలులు పెరిగిపోయాయి. భరించలేనంత ఉక్కపోత! నీళ్లు తాగుతున్నా ఊరట దొరకక సతమతం! రోజు రోజుకూ పెరుగుతున్న ఎండలు.. వడ గాడ్పులతో రాష్ట్ర ప్రజలు కూడా ఆ ప్రయాణికుడి లాంటి అవస్థే పడుతున్నారు. వడదెబ్బకు గురై మృతిచెందేవారి సంఖ్య ఏడాదికేడాదీ పెరుగుతూనే ఉంది. ఈ వేసవిలో ఇప్పటికే అది 35 దాటిపోయింది. గత ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే 2018లో మాత్రమే అతి తక్కువగా ఎనిమిది వడదెబ్బ మరణాలు నమోదయ్యాయి. ఈ ఏడాది అంతకు మూడు నాలుగు రెట్లు మరణాలు పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత ఐదేళ్లలో రాష్ట్రంలో 2,784 మంది వేడిగాలులకు గురయి, మృతి చెందారు. 2014లో 448, 2015లో 1369, 2016లో 723, 2017లో 236, 2018లో ఎనిమిది మంది వడదెబ్బకు చనిపోయారు. పల్లెలతో పోలిస్తే పట్టణాల్లో ఎండలు ఎక్కువగా ఉంటాయి.
 
 
ఇటీవల ఇవి మరింత ఎక్కువయ్యాయి. విజయవాడ, గుంటూరు, ఇతర నగరాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. పట్టణాలు, నగరాల్లో పెరుగుతున్న భవనాల నిర్మాణం దీనికి ఒక కారణంగా కనిపిస్తోంది. ఎత్తైన భవనాల కారణంగా పట్టణాల్లో గాలి ప్రవాహ వేగం నెమ్మదిస్తోంది. దాంతో సూర్యుని కిరణాలు నేరుగా భూమిని తాకుతున్నాయి. గాలి ప్రవాహం వేగంగా ఉంటే వాటి తీవ్రత తగ్గుతుంది. ఏసీల వాడకం పెరగడంతో వాటి నుంచి వచ్చే వేడి గాలిలో కలుస్తోంది. 2015, 2016 ల్లో ఎండలు మండిపోయాయి. దాదాపు 49 డిగ్రీల ఉష్ణోగ్రతలతో రాష్ట్రం ఉడికిపోయింది. గతంలో ఎన్నడూలేని స్థాయిలో ఆ రెండేళ్లలోనే ఎక్కువ మంది చనిపోయారు. ఆ ప్రభావం 2017లోనూ కొనసాగినా.. మృతుల సంఖ్య చాలా వరకూ తగ్గింది. ఈ ఐదేళ్ల లెక్కలతో పోల్చుకుంటే.. 2018 కాస్త నయం. ఉష్ణోగ్రతలు 44.9 డిగ్రీలు దాటలేదు. మళ్లీ ఈ ఏడాది 47.1 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, రాయలసీమ జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఈ జిల్లాల్లోనే ఎక్కువ మంది మృతి చెందారు.