సిక్కోలులో ఇద్దరు మృతి.. ఐదుగురికి గాయాలు

Published: Monday May 27, 2019
రోహిణీ కార్తె à°Žà°‚à°¡ ఆదివారం ఉదయం జనాన్ని ఠారెత్తిస్తే.. సాయంత్రం ఈదురుగాలులు, పిడుగులు రాష్ట్రంలో పలుచోట్ల భయబ్రాంతులకు గురిచేశాయి. పిడుగులవల్ల శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు చనిపోగా.. ఐదుగురు గాయపడ్డారు. ఈదురుగాలుల ధాటికి కంచిలి రైల్వేస్టేషన్‌ పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. సోంపేట, బారువ, కవిటి, పలాస, పాలకొండ, సీతంపేట, శ్రీకాకుళం, గార, రేగడి, ఎల్‌ఎన్‌ పేట, కొత్తూరు, ఆమదాలవలస, రాజాం, ఎచ్చెర్లలో భారీ వృక్షాలు నేలకొరిగాయి. రెండు గంటలపాటు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. బూర్జ మండలం కొల్లివలసలో ఇంటిముందు పిడుగు పడి వీస వీరన్నాయుడుతోపాటు.. à°’à°• ఆవు చనిపోయింది. పిడుగుపాటుకు కొత్తూరు మండలం కలిగాంలో పాతిన దశరథరావు మృతిచెందాడు. జిల్లాలో మరో ఐదుగురు గాయపడ్డారు. విజయనగరం జిల్లా కురుపాంలోని మహలక్ష్మీ జూనియర్‌ కళాశాల సమీపంలో పిడుగుపడి కుమ్మరి తవుడు (55) అనే వ్యక్తి మృతి చెందాడు.
 
ఈదురుగాలులకు రాలిన మామిడికాయలు ఏరుకోవడానికి అతను జూనియర్‌ కళాశాల సమీపంలోని మామిడి చెట్టు వద్దకు వెళ్లాడు. ఇంతలో వర్షం ఎక్కువ కావడంతో చెట్టు à°•à°¿à°‚à°¦ నిలుచున్నాడు. పిడుగు పడటంతో అక్కడికక్కడే చనిపోయాడు. నిరుపేదైన తవుడుకు భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం, పాచిపెంట, జియ్యమ్మవలస, కురుపాం మండలాల్లో గాలులతో కూడిన వర్షం కురిసింది. ప్రకాశం జిల్లాలోనూ పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. మూడు మండలాల ప్రజలను వణికించాయి. పలుచోట్ల చెట్లు నేలకూలాయి. ఇళ్లపై ఉన్న రేకులు ఎగిరిపోయాయి. పెద్దదోర్నాల మండలం కొత్తూరు సమీపంలో కర్నూలు-గుంటూరు జాతీయ రహదారిపై భారీ వృక్షం నేలకొరిగింది. జరుగుమల్లి మండలం కామేపల్లి, సతుకుపాడు, నేతివారిపాలెంలో ఈదురుగాలుల ప్రభావం అధికంగా కనిపించింది. కామేపల్లిలోని పోలేరమ్మతల్లి ఆలయానికి చెందిన రెండు షెడ్డులు, ఆలయంలోని ప్రహరీ కూలిపోయింది.
 
వలేటివారిపాలెంలోని బస్టాండ్‌ సెంటర్‌లోని తాటాకు పందిళ్లు, రేకులషెడ్లు ఎగిరిపడ్డాయి. ఇదిలా ఉంటే పశ్చిమ గోదావరి జిల్లాలో వడగళ్ల వర్షం పడింది. జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం, కుక్కునూరు, వేలేరుపాడు, బుట్టాయిగూడెం తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు పలకరించాయి. వేలేరుపాడులో ఊరుములకు జనం బెంబేలెత్తిపోయారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోనూ అక్కడక్కడా వర్షాలు పడ్డాయి. బెజవాడలో ఆదివారం సాయంత్రం కొద్దిసేపు వాతావరణం చల్లబడి చినుకులు ప్రజలకు ఉపశమనం కలిగించాయి. తిరుమలలో మధ్యాహ్నం జోరున వర్షం కురిసింది. భక్తులు తడిసి ముద్దయ్యారు. నారాయణగిరి, స్వామివారి ఆలయ పరిసరాల్లో ఏకబిగిన అరగంటపాటు వర్షం పడింది. దీంతో నారాయణగిరి ఉద్యానవనాల్లోని షెడ్ల పైకప్పులు వర్షానికి కుంగిపోయాయి. ఉదయం ఎండలకు అల్లాడిపోయిన జనం వర్షంలో తడుస్తూనే క్యూలైన్లకు వెళ్లడం కనిపించింది.