మార్చిలో మొదలైన ఎండ ఏప్రిల్‌, మేలలో మరింత తీవ్రత

Published: Monday May 27, 2019
 ఇది సుదీర్ఘ వేసవి. ఎప్పుడో మార్చి రెండో వారంలో ఎండలు మొదలయ్యాయి. ఏప్రిల్‌లో ఉక్కిరిబిక్కిరి చేశాయి. మేలో తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. జూన్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగేలా ఉంది. రుతుపవనాలు వస్తే వాతావరణం చల్లబడుతుంది. కానీ అవొచ్చినా ఎండలు మరికొంత కాలం తప్పేలా లేవు. అందుకే ఇది సుదీర్ఘ వేసవిగా వాతావరణ నిపుణులు అభివర్ణిస్తున్నారు. వడగాడ్పులపట్ల మరికొంతకాలం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావం, వేసవి తీవ్రత వెరసి నైరుతి రుతుపవనాల రాకలో జాప్యం జరుగుతోంది. ఇప్పటివరకు ఉన్న అంచనాల మేరకు వచ్చేనెల మొదటి వారం వరకు ఎండలుంటాయని ఆర్టీజీఎస్‌, ఇస్రో నిపుణుడు తెలిపారు. సాధారణంగా ఎండ, చలి, వర్షాలు స్పెల్స్‌గా (ఐదారు రోజులు)గా వస్తుంటాయి. స్పెల్స్‌ తీవ్రత ఉన్నరోజుల్లో దాని ప్రభావం ఉండి తర్వాత తగ్గుతుంది. అయితే మార్చి రెండోవారం నుంచి రాయలసీమలో, గతనెల నుంచి కోస్తాలో ఎండలు ఒకేమాదిరిగా కొనసాగుతున్నాయి. మధ్యలో ఒకటి రెండు రోజులు వాతావరణం కొంత చల్లబడినా ఎండలు అదరగొడుతున్నాయి.
 
 
గతేడాది నైరుతి, ఈశాన్య రుతుపవనాల కాలంలో వర్షాభావం నెలకొనడంతో చెరువులు, వాగులు ఎండిపోయాయి. రిజర్వాయర్లు అడుగంటాయి. బావుల్లో నీరు ఇంకిపోయింది. గతనెలలో వచ్చిన తుఫాన్‌ ఒడిసా తీరం దాటింది. అదే ఏపీలో తీరం దాటితే వర్షాలు కురిసేవి. సాధారణంగా రుతుపవనాల రాకముందు ప్రీమాన్‌సూన్‌ వర్షాలు కురవాలి. ప్రస్తుతం అడపా దడపా తప్ప ఎక్కువచోట్ల అటువంటి వర్షాలు లేవు. ఇదే సమయంలో వాయవ్యప్రాంతం నుంచి ఎడారి గాలులు మధ్య భారతం మీదుగా రాష్ట్రంపైకి వీస్తున్నాయి. విదర్భ, ఛత్తీ్‌సగఢ్‌, తెలంగాణలో రోజుల తరబడి ఎండలు కాస్తుండడంతో ఆ ప్రభావం కోస్తా, రాయలసీమపై కనిపిస్తోంది.