రోడ్డు మధ్య ఆగిపోయిన లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు

Published: Friday May 31, 2019
తెల్లవారుజాము 4 గంటలు.. ఇం కా చీకట్లు తొలగలేదు.. ఓ వైపు భారీ వర్షం.. ఈదురు గాలులు.. రోడ్డు మధ్యలో లారీ ఆగిపోయింది.. అదే సమయంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు వేగంగా వచ్చి ఢీకొంది. అంతే.. లారీలోని ఇనుపచువ్వలు శరీరంలో చొచ్చుకుపోయి ఇద్దరు బస్సు డ్రైవర్లు, మరో ప్రయాణికుడు దుర్మరణం పాలయ్యారు. కర్నూలు జిల్లాలోని.. హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిలో చిన్నటేకూరు వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిందీ ఘోర ప్రమాదం. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాదు నుంచి ఐరన్‌ పైపులతో కూడిన లారీ బెంగళూరు వెళ్తూ చిన్న టేకూరు దాటిన తర్వాత హమారా ఘర్‌ అనే డాబా సమీపాన బ్రేక్‌ డౌన్‌ అయ్యి నిలిచిపోయింది. తెల్లవారుజామున ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుండటంతో డ్రైవర్‌ లారీని రోడ్డు మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయాడు. అదే సమయంలో హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌ బస్సు వేగంగా దూసుకొచ్చి లారీని ఢీకొట్టింది. లారీలోని ఐరన్‌ పైపులన్నీ బస్సులోకి చొచ్చుకుని వచ్చాయి.
 
 
ఈ ప్రమాదంలో బస్సు నడుపుతున్న చంద్రశేఖర్‌ (38)తోపాటు, పక్కన కో-డ్రైవర్‌గా ఉన్న కృష్ణ (40) శరీరంలోకి దూసుకుపోవడంతో వారు దుర్మరణం పాలయ్యారు. బస్సు ఒక్కసారిగా పెద్ద కుదుపునకు గురికావడంతో.. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఎగిరి తమ ముందు ఉన్న సీట్లను కొట్టుకుని కింద పడ్డారు. డ్రైవర్‌ వెనుక సీటులో కూర్చున్న మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన ప్రయాణికుడు సంతోష్‌ (35) తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన హైదరాబాద్‌లోని డిజిటల్‌ సొల్యూషన్స్‌లో పనిచేస్తున్నట్లు తెలిసింది. బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్‌ సహా బస్సులో మొత్తం 53 మంది ఉండగా, అందులో 12 మందికి స్వల్ప గాయాలయ్యాయి. చీకట్లో ప్రయాణికుల హాహాకారాలతో ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. ఉలిందకొండ, ఓర్వకల్లు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను బయటికి తీశారు. ఇద్దరు డ్రైవర్ల మృతదేహాలు వాహనంలో ఇరుక్కుపోవడంతో క్రేన్ల సాయంతో బయటకు తీశారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సు మధ్య భాగంలో కూర్చోవడంతో ఒకే కుటుంబానికి చెందిన 12 మంది సభ్యులున్న పెళ్లి బృందానికి ప్రమాదం తప్పింది.
 
కాగా, నెల వ్యవధిలో ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌ బస్సుకు ఇది రెండో ప్రమాదం. మే 11న వెల్దుర్తి వద్ద ఓ మోటారు సైకిలిస్టును తప్పించబోయి ఓ వాహనాన్ని ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో బస్సులో ఉన్న 16 మంది దుర్మరణం పాలయ్యారు.