కుటుంబంతో తిరుమల చేరుకున్న రాష్ట్రపతి

Published: Sunday July 14, 2019

రాష్ట్రంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కుటుంబంతో కలసి శనివారం తిరుమల చేరుకున్నారు. చెన్నై నుంచి విమానంలో సాయంత్రం 5:15గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు, సీఎం వైఎస్‌ జగన్‌, ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఎంపీ విజయసాయిరెడ్డి తదితరులు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి బయల్దేరిన ఆయన 5:50గంటలకు తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయం చేరుకున్నారు. మహద్వారం వద్ద వేదపండితులు ఇస్తికపాల్‌ స్వాగతం పలికి ఆలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం కపిలతీర్థం ఆలయాన్ని రాష్ట్రపతి సందర్శించారు. కపిలేశ్వరస్వామిని దర్శించుకొని తిరుమలకు చేరుకున్నారు. రాష్ట్రపతి హోదాలో రెండోసారి తిరుమల పర్యటనకు వచ్చిన కోవింద్‌ దంపతులకు పద్మావతి విశ్రాంతిగృహం వద్ద టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో సింఘాల్‌, ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి సాదర స్వాగతం పలికారు. కోవింద్‌ శనివారం రాత్రి తిరుమలలోనే బస చేస్తారు. ఆదివారం ఉదయం 5:30గంటలకు సంప్రదాయ వస్త్రధారణతో బయల్దేరి తొలుత వరాహస్వామిని దర్శించుకుంటారు. à°† తరువాత ఆలయం మహద్వారం నుంచి సన్నిధికి చేరుకుని మూలమూర్తిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం తిరుమల నుంచి తిరుగు ప్రయాణమై రేణిగుంట విమానాశ్రయానికి వెళ్తారు. రాత్రికి శ్రీహరికోటలో బస చేస్తారు.సోమవారం తిరిగి ఢిల్లీ బయల్దేరి వెళతారు.