ఆదాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి

Published: Wednesday July 17, 2019

ఆదాయ మార్గాల పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించింది. పన్నేతర ఆదాయ మార్గాలను పరిశీలిస్తోంది. గనుల శాఖ నుంచి ఏటా రూ.10,000 కోట్ల వరకు ఆదాయం లభించే అవకాశాలున్నాయని గుర్తించింది. దీంతోపాటు ఎర్రచందనం, అటవీ ఉత్పత్తులపై కూడా దృష్టి పెట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దశల వారీగా మద్యనిషేధం అమలు చేయనున్న నేపథ్యంలో ఖజానా కష్టాల్లో పడకుండా ఉండేందుకు మద్యం ధరలను భారీగా పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. అదేసమయంలో ఆర్టీసీ చార్జీలు à°—à°¤ రెండున్నరేళ్ల నుంచి పెంచలేదు కాబట్టి, వాటిని కూడా పెంచాలనే యోచనలో ఉంది. ప్రస్తుత బడ్జెట్‌లో పన్నేతర ఆదాయం ద్వారా రూ.7,300 కోట్లు వస్తుందని అంచనా వేశారు. అయితే, దీనిలో రూ.5000 కోట్లు మాత్రమే వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో ఇతర ఆదాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించింది.