పొర్లుదండాలతో మెట్లెక్కిన నెల్లూరు జిల్లా వాసి

Published: Sunday July 21, 2019
అందరిలా తన కోసమో.. తన కుటుంబం కోసమో కాకుండా.. రైతు శ్రేయస్సు కోరుతూ ఓ వ్యక్తి తిరుమల వెంకన్నను దర్శించుకోవడానికి ఏకంగా 3550 మెట్లను పొర్లుదండాలు పెడుతూ ఎక్కడం విశేషం. వర్షాలు బాగా పడాలని, రైతులందరూ సంతోషంగా ఉండాలన్నదే తన అభిమతంగా చెప్పాడు. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం, నందిపాడుకు చెందిన కంకు బాలాజీది వ్యవసాయ కుటుంబం. వర్షాభావ పరిస్థితుల్లో వ్యవసాయం వదిలి భార్య, కుమార్తెతో కలిసి నెల్లూరులో సోడా బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. తనకు వచ్చిన ఆదాయంలో కొంత సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుంటాడు. నిరుపేద వృద్ధులు, దివ్యాంగులు, రోగులు, యాచకులు దాహంతో వస్తే నిమ్మ సోడా ఉచితంగానే ఇస్తాడు. ఏడాదిలో పలుమార్లు అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటాడు.
 
 
ఇటీవల కాలంలో సరైన వర్షాలు లేక రైతులు తీవ్ర కష్టాల్లో ముగినిపోతున్నారని, అప్పుల బాధలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని విని బాలాజీ ఆవేదన చెందాడు. ‘పొర్లుదండాలతో కొండెక్కి నిన్ను దర్శించుకుంటా. రైతులు కష్టాలు తీర్చుస్వామీ’ అంటూ స్వామికి మొక్కుకున్నాడు. అందులో భాగంగానే శుక్రవారం సాయంత్రం అలిపిరికి చేరుకుని పొర్లుదందాలు ప్రారంభించాడు. శనివారం వేకువజాముకు తిరుమలకు చేరుకుని తలనీలాలు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నాడు. గుడిముందు బాలాజీ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ రైతులు సంతోషంగా ఉండాలని, పాడిపంటలతో రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలిపాడు. పొర్లుదండాలు పెడుతుండగా ఒకసారి గుండెపట్టేసినట్టు అనిపించిందని, అయినప్పటి à°•à±€ స్వామి ఆశీస్సులతో కొండ చేరానని కన్నీటితో వివరించాడు.