స్వాతంత్య్ర వేడుకలను అడ్డుకునేందుకు వైసీపీ యత్నం

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యేను ఆహ్వానించిన అధికారులు... తమను ఎందుకు పిలవలేదంటూ చీరాలలో వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కార్యాలయం వెలుపల వైసీపీ కార్యకర్తలు, వారికి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు మోహరించారు. దీంతో, ఎవరూ లోపలికి రాకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అయితే ఆ తరువాత కార్యాలయం వెలుపుల వైసీపీ శ్రేణులు చేసిన దాడిలో నలుగురు టీడీపీ వర్గీయులు గాయపడ్డారు. దీంతో కొంతసేపు పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే పోలీస్ చర్యలు తప్పవంటూ డీఎస్పీ జయరామసుబ్బారెడ్డి హెచ్చరించడంతో వైసీపీ కార్యకర్తలు వెనక్కితగ్గారు. అంతటితో సమస్య సద్దుమణిగిందనుకుంటే... ఆ తర్వాత డ్రైనేజి అతిఽథిగృహంలో వైసీపీ శ్రేణులు, ఆర్‌అండ్‌బీ అతిఽథిగృహంలో ఎమ్మెల్యే బలరాం, కార్యకర్తలు భేటీ అయ్యారు. ఈ క్రమంలో వన్‌టౌన్ సీఐ నాగమల్లేశ్వరరావు ఆర్‌అండ్‌బీ అతిఽథిగృహానికి చేరుకుని అక్కడి వారిని పంపించే ప్రయత్నం చేయగా... హద్దుమీరిన వారిని అదుపులో తీసుకోవాలని ఎమ్మెల్యే బలరాం, కరణం వెంకటేశ్ సూచించారు. అదే సమయంలో డ్రైయినేజీ అతిథిగృహం వైపు బయలుదేరిన వైసీపీ శ్రేణులు... ఆ మార్గంలోని కమ్మసంఘంలో ఫ్లెక్సీలను చించేశారు. అక్కడున్న ఒకరిపై దౌర్జన్యం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు... ఉడ్‌నగర్ వద్దకు వచ్చే సమయానికి వైసీపీ శ్రేణులను అడ్డుకున్నారు. ఇరువైపుల వారికి సర్దిచెప్పి పంపించివేయడంతో సమస్య సద్దుమణిగింది.

Share this on your social network: