విస్తారంగా వర్షాలు.. పుంజుకున్న పంటల సాగు

Published: Saturday August 24, 2019
ఉపరితల ఆవర్తనాలతో రుతుపవనాలు చురుకుగా కదులుతూ రాష్ట్రవ్యాప్తంగా నాలుగైదు రోజులుగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమలోనూ వానలు ఆశాజనకంగా పడుతున్నాయి. దీంతో ఖరీఫ్‌ పంటలు సాగు చేస్తున్న రైతులు కాస్త కుదుట పడ్డారు. అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురవడం, వరదలతో జలాశయాలు నిండి, కాలువలకు నీటి విడుదలవడంతో సాగునీటి సమస్య కొంత తీరి, రైతులకు ఊరట కలిగింది. ఇప్పటికే సాగులో ఉన్న పంటలకు తీవ్ర వర్షాభావం నుంచి వర్షాలతో ఉపశమనం కలగగా, ఇంకా విత్తనం వేయని రైతులు పైర్లు వేసుకునేందుకు అవకాశం కలిగిందని చెప్తున్నారు. ప్రస్తుతంరాష్ట్రంలో వర్షపాత లోటు 16.8%కు తగ్గింది. రాయలసీమలోనూ వర్షాలు కురుస్తుండడంతో కొంతమంది వేరుశనగ, చిరుధాన్య, నూనెగింజల పంటలు వేస్తున్నారు. దక్షిణ కోస్తా జిల్లాల్లో పత్తి, మిర్చి, అపరాల సాగు పుంజుకుంది. ఉత్తరాంధ్ర, కృష్ణా, గోదావరి మండలాల్లో నదీ జలాలతో వరి నాట్లు ఊపందుకున్నాయి.
 
13 జిల్లాల్లో 38.30లక్షల హెక్టార్లకు 26లక్షల హెక్టార్లు సాగులోకి వచ్చింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వాన తక్కువగా ఉన్నా వంశధార, నాగావళి నదీ జలాలతో వరి నాట్లు సాగుతున్నాయి. గోదావరి, కృష్ణా నదులకు వరదలతో రిజర్వాయర్లు నిండడంతో కాలువలు నీటితో కళకళలాడుతున్నాయి.దీంతో సార్వావరి సాగు 10లక్షల హెక్టార్లకు చేరింది. చెదురు మదురు వర్షాలతో కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లా మెట్ట ప్రాంతాల్లో పత్తి సాగు పుంజుకుంది. పత్తి విస్తీర్ణం 6లక్షల హెక్టార్లకు వచ్చింది. వేరుశనగ విత్తడానికి అదును మించిపోయినా, సీమ జిల్లాల్లో వర్షాలు, కాలువలకు నీటి విడుదలతో రైతులు ఆశగా అక్కడక్కడా వేరుశనగ వేస్తున్నారు. ఇప్పటికే 4.25 లక్షల హెక్టార్లలో వేరుశనగ వేశారు. వాతావరణం అనుకూలంగా మారుతుందన్న ఉద్దేశంతో మెట్ట రైతులు మిర్చి సాగు చేపడుతున్నారు. ఇప్పటికే 40వేల హెక్టార్లలో మిర్చి వేసినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.