మాజీ విప్‌ కూన అరెస్టుపై పోలీసుల హైరానా

Published: Thursday August 29, 2019
తనపై మాజీ విప్‌ కూన రవికుమార్‌తో పాటు మరో 11మంది దాడి చేశారంటూ సరుబుజ్జిలి ఎంపీడీవో దామోదరరావు సోమవారం అర్ధరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రవికుమార్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో ఆయన అరెస్టుపై ఉత్కంఠ కొనసాగుతోంది. à°—à°¤ రెండు రోజులుగా పోలీసులు హైరానా పడుతున్నారు. బుధవారం రవికుమార్‌తో పాటు మిగతా వారు కూడా అరెస్టు కానున్నారన్న ప్రచారంతో ఉదయం నుంచే పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా ఆమదాలవలస పట్టణంలోని టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ వారంతా సమావేశమవగా రవికుమార్‌ కూడా అక్కడే ఉంటారని పోలీసులు వెళ్లారు. ఆయన లేకపోవడంతో వెనుదిరిగారు. మధ్యాహ్నం 2గంటలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కిమిడి కళావెంకట్రావు ఆమదాలవలస చేరుకున్నారు. అప్పటికే నాయకులు చౌదరి బాబ్జి, కేవీ సత్యనారాయణ, అన్నెపు రామకృష్ణ, మొదలవలస రమేష్‌, నూక సుదర్శనరావు, సనపల డిల్లేశ్వరరావు, మెట్ట సుజాత, నూక రాజు, అన్నెపు భాస్కరరావు, తదితరులు ఉన్నారు. పార్టీ శ్రేణులతో కళా సమాలోచనలు చేశారు.
 
10 మందిని పోలీసులు అరెస్టు చేశారని, వారిని కోర్టులో హాజరుపరుస్తారని తెలియడంతో పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆమదాలవలస పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. ఇంతలో డీఎస్పీ శ్రీనివాసచక్రవర్తితో పాటు సీఐ ప్రసాదరావు, ఆమదాలవలస, బూర్జ, సరుబుజ్జిలి ఎస్‌ఐలతో పాటు పోలీసులు, ప్రత్యేక బలగాలు స్టేషన్‌ వద్దకు చేరుకోవడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. సాయంత్రం 4.40 గంటలకు 10 మంది నిందితులను వాహనాల్లో స్టేషన్‌కు తీసుకువచ్చారు. పది నిమిషాల్లో అరెస్టుల ప్రక్రియ ముగించిన పోలీసులు 5 à°—à°‚à°Ÿà°² సమయంలో వారిని కోర్టులో ప్రవేశపెట్టారు. అరెస్టయిన వారిలో నందివాడ గోవిందరావు, కూన అమ్మినాయుడు, కూన సంజీవరావు, పల్లె సురేష్‌, గండెం రవి, తాడేల రమణ, యండ రామారావు, గుర్రాల చినబాబు, ఊటపల్లి రామక్రిష్ణ, బాణ్న గురువులు ఉన్నారు. ఏ1 నిందితులు కూన రవికుమార్‌తో పాటు అంబళ్ల రాంబాబు అజ్ఞాతంలో ఉన్నారు. కాగా, పది మంది నిందితులను ఆమదాలవలస కోర్టులో హాజరుపర్చగా వారికి సెప్టెంబరు 11 వరకు జూనియర్‌ సివిల్‌ జడ్జి బి.జ్యోత్స్న రిమాండ్‌ విధించారు. à°ˆ కేసుపై గురువారం వాదోపవాదనలు జరగనున్నాయి.
 
శ్రీకాకుళం శాంతినగర్‌ కాలనీలోని మాజీ విప్‌ కూన రవికుమార్‌ ఇంటికి బుధవారం మధ్యాహ్నం పోలీసులు వచ్చారు. వారిని రవి భార్య ప్రమీల అడ్డుకున్నారు. వారెంట్‌ లేకుండా ఇంటిని ఎలా సోదా చేస్తారని ప్రశ్నించడంతో పోలీసులు వెనుదిరిగారు. వారు ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో ఎస్‌టీఎఫ్‌ బృందాలను రవి ఇంటి చుట్టూ ఏర్పాటు చేశారు. అలాగే, ఇంటి గేటు వద్ద à°’à°• ఏఎస్‌ఐ, హెడ్‌ కానిస్టేబుల్‌, మహిళా హోంగార్డు పికెటింగ్‌ నిర్వహిస్తున్నారు.