అమరావతి ఏమవుతుందో తెలియని పరిస్థితి

Published: Sunday September 01, 2019
‘ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి కేవలం 29 గ్రామాలకు చెందిన రైతుల సమస్య మాత్రమేనా? ఐదు కోట్ల మందికి రాజధానితో సంబంధం లేదా? వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఈవారం రోజులుగా చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే à°ˆ సందేహం కలుగుతోంది. రాష్ట్రం విడిపోయిన కొత్తలో హైదరాబాద్‌ను కోల్పోయామన్న బాధతో తమకు కూడా గొప్ప రాజధాని ఉండాలన్న భావోద్వేగం రాష్ట్ర ప్రజలలో ఉండింది. రాజధాని నిర్మాణం కోసం ఎంతో మంది విరాళాలు ఇచ్చారు. కొందరు మహిళలు తమ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను కూడా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇచ్చారు. కానీ, కొత్తపాలకులు రాజధాని నిర్మాణం పట్ల ప్రజల్లో ఎటువంటి భావోద్వేగం లేకుండా చేశారు. అమరావతి ఎవరి కోసం? అంటూ దిక్కుమాలిన ప్రశ్నలు వేశారు. à°ˆ మొత్తం వ్యవహారం చూస్తుంటే గురజాడ అప్పట్లో à°°à°šà°¿à°‚à°šà°¿à°¨ కన్యాశుల్కంలో ‘మనవాళ్లు ఉత్త వెధవాయలోయ్‌’ అని గిరీశంతో చెప్పించిన డైలాగు గుర్తుకు వస్తోంది.
 
గురజాడవారు విజయనగరం జిల్లాలో జన్మించడం, అప్పట్లో తెలంగాణతో ఆంధ్రా ప్రాంతానికి పెద్దగా సంబంధం లేనందున ఆంధ్రులను ఉద్దేశించే గిరీశం à°† మాట అన్నారని భావించవచ్చు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రులు గర్వించే రాజధాని ఉండాలని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తలపోశారు. అయితే, ప్రభుత్వం వద్ద చిల్లిగవ్వ కూడా లేనందున భూసేకరణకు బదులు భూసమీకరణ ఆలోచన చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి భూములిచ్చిన రైతులకు లాభసాటిగా ఉండేలా పథక à°°à°šà°¨ చేశారు. ఫలితంగా రైతుల నుంచి సేకరించిన 33 వేల ఎకరాలతోపాటు ప్రభుత్వ భూములు కూడా కలిసి మొత్తం దాదాపు 50వేల ఎకరాల భూమి రాష్ట్రప్రభుత్వానికి సమకూరింది. రాజధానిని విజయవాడలో నిర్మించినా తమకు అభ్యంతరం లేదనీ, అయితే అందుకోసం కనీసం 30 వేల ఎకరాలన్నా ఉండాలనీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్‌ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు.
 
రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ భవనాలు, ఇతర మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధుల కోసం... సేకరించిన భూమినే పెట్టుబడిగా మలచుకునే ప్రయత్నాన్ని చంద్రబాబు చేశారు. రైతుల వాటాతోపాటు మౌలిక వసతులకు, వివిధ సంస్థలకు కేటాయించే భూమి పోగా, ప్రభుత్వం వద్ద 15 వేల ఎకరాలకుపైగా భూమి ఉంటుందనీ, ఆ భూమిని వేలం వేయడం ద్వారా రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు సమకూర్చుకోవచ్చుననీ లెక్కలు వేసుకున్నారు. భూ సమీకరణకు ముందు ఎకరం 10 నుంచి 30 లక్షల వరకు మాత్రమే పలికిన ఆ భూముల విలువ నాలుగేళ్లు గడిచేసరికి ఎకరం 3 కోట్ల రూపాయల వరకు పెరిగింది. అధికార మార్పిడి జరిగి ఉండకపోతే ఇప్పుడు ఆ ధర 5 కోట్ల రూపాయలకు చేరి ఉండేది. వివిధ సంస్థలు, కంపెనీలకు కేటాయించే భూములు పోగా రాష్ట్ర ప్రభుత్వం వద్ద దాదాపు ఏడెనిమిది కోట్ల గజాల స్థలం వేలానికి సిద్ధంగా ఉంటుందని లెక్కలు కట్టారు.