‘ఆత్మహత్య చేసుకుంటాడని ఎందుకు పసిగట్టలేకపోయారు?

Published: Thursday September 05, 2019
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డిపై ఎందుకు నిఘా పెట్టలేదని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ‘ఆత్మహత్య చేసుకుంటాడని ఎందుకు పసిగట్టలేకపోయారు? అనుమానితులపై ఇలాగేనా వ్యవహరించేది?’ అంటూ నిలదీసినట్టు సమాచారం. ఆత్మహత్యకు పాల్పడిన శ్రీనివాసరెడ్డి సూసైడ్‌ నోట్లు మంగళవారం వెలుగులోకి రావడం సంచలనం సృష్టించింది. వివేకా హత్య కేసుతో à°ˆ ఆత్మహత్య ముడిపడి ఉండడంతో డీజీపీ హుటాహుటిన బుధవారం అమరావతి నుంచి కడపకు చేరుకున్నారు.
 
వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌ బృందాలతో సమావేశమయ్యారు. ఉదయం 10 నుంచి మధ్యా హ్నం 3 à°—à°‚à°Ÿà°² వరకు à°ˆ సమీక్ష కొనసాగింది. ఇతర పోలీసు అధికారులనెవరినీ à°ˆ సమీక్షకు ఆహ్వానించలేదు. టీడీపీ ప్రభుత్వంలో నియమించిన ఏడుగురు సభ్యుల సిట్‌, జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత నియమించిన 33 మంది సభ్యుల బృందంలతో విడివిడిగా డీజీపీ మాట్లాడారు. వివేకా హత్య అనంతరం ఎలాంటి విచారణ చేశారు? ఇప్పటివరకు ఎలాంటి సమాచారాన్ని సేకరించారు? హత్య వెనుక అసలు వ్యవహారం ఏమిటి? తదితర ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలిసింది. వారు చెప్పిన వివరాలన్నీ డీజీపీ స్వయంగా నమోదు చేసుకున్నారు.
 
శ్రీనివాసరెడ్డి రాసినట్టు చెబుతున్న సూసైడ్‌నోట్‌లపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని, వెంటనే ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపి వాస్తవాలు తెలుసుకోవాలని, కడపతోపాటు సింహాద్రిపురంలో దర్యాప్తు జరపాలని డీజీపీ ఆదేశించారు. ‘à°ˆ కేసు దర్యాప్తునకు డీఎస్పీ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించండి. ఇది చాలా సెన్సిటివ్‌ కేసు, సత్వరం విచారణ నిర్వహించి అసలు విషయం తేల్చండి’ అని ఆదేశించారు. రాత్రి 7 గంటలకు కలెక్టర్‌ హరికిరణ్‌ డీజీపీని కలిశారు. వివేకా హత్యకేసు, శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య తదితరాలపై వీరి మధ్య చర్చ సాగినట్టు సమాచారం.
 
తర్వాత రాత్రి 9 గంటలకు పులివెందులలో వైఎస్‌ వివేకా ఇంటిని డీజీపీ పరిశీలించారు. వివేకా అల్లుడు రాజశేఖరరెడ్డితో కాసేపు ఆయన మాట్లాడారని సమాచారం. వివేకా హత్యపై రెండు రోజుల్లో సమగ్ర నివేదికను సీఎంకు అందిస్తారని తెలిసింది. డీజీపీ పర్యటనను కవర్‌ చేసేందుకు మీడియా పడిగాపులు కాసినా డీజీీపీ పట్టించుకోలేదు.