ఇంటి తలుపులు బద్దలుకొట్టి.. చివరికి..

Published: Sunday September 08, 2019
న్యాయం కోసం మండపేటలో అత్తమామల ఇంటి ముందు ఆందోళన చేస్తున్న వివాహితకు ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, అమలాపురం ఎంపీ చింతా అనురాధ బాసటగా నిలిచారు. శనివారం బాధితురాలి అత్తమామల ఇంటి తాళాన్ని బద్దలుకొట్టి ఆమెను ఇంట్లోకి పంపించారు. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకురుకు చెందిన రామలక్ష్మికి మండపేటకు చెందిన సతీష్‌తో వివాహమైంది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత సతీష్‌ ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. అత్తింటి వారు కూడా ఆమెను గెంటేసి తాళ్లం వేసుకుని వెళ్లిపోయారు. దీంతో బాధితురాలు న్యాయం కోసం అత్తమామల ఇంటి ముందు ఆందోళన జరిపింది. ఇది తెలుసుకున్న అమలాపురం ఎంపీ చింతా అనురాధ ఆమెకు సంఘీ భావం తెలిపారు.
 
అత్తమామలను పిలిపించి బాధితురాలిని ఇంట్లోకి రానివ్వాలని చెప్పగా వారు నిరాకరించారు. దీంతో డిప్యూటీ సీఎం పిల్లి సుభాస్‌ చంద్రబోస్‌ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని సర్ది చెప్పినా వినిపించుకోకపోవటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, తహశీల్దార్‌, స్థానికుల సమక్షంలో తాళాలను బాధితురాలు రామలక్ష్మీతో బద్దలు కొట్టించి ఇంట్లోకి పంపారు. హాని తలపెడితే సహించేది లేదని ఆమె అత్తమామలను మంత్రి హెచ్చరించారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, మండపేట రూరల్‌ సీఐ మంగాదేవి, తహశీల్దార్‌ నాగలక్ష్మి, ఎస్‌ఐ తోట సునీత తదితరులు ఉన్నారు.