మహానంది క్షేత్రాన్ని ముంచెత్తిన వరద

Published: Wednesday September 18, 2019
ఉత్తర తమిళనాడు పరిసరాల్లో ఏర్పడిన తుఫాన్‌ ప్రభావంతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడ్డాయి. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో à°“ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిశాయి. కర్నూలు జిల్లా నల్లమల పరిసర ప్రాంతాల్లో కురిసిన అతి భారీవర్షాలకు నదులు, వంకలు, వాగులు ఉప్పొంగాయి. పల్లెలకు రాకపోకలు నిలిచిపోయాయి. మహానంది క్షేత్రాన్ని వరద ముంచెత్తింది. వర్షం నీరు ఆలయాన్ని ముంచెత్తింది. 1976లో ఆలయంలోకి నీరు చేరిందని, మళ్లీ 43ఏళ్ల తర్వాత మళ్లీ మహానంది జల దిగ్బంధంలో చిక్కుకుందని పండితులు తెలిపారు. రుద్రమండపం కోనేరును ముంచెత్తిన వరద ఆలయ ప్రధాన ద్వారం గుండా ఉధృతంగా ప్రవహించింది. వెలుపల ఉన్న పూల కోనేర్లు వరద నీటిలో కలిసిపోయాయి. అభిషేక మండపం మునిగిపోయింది. ఆలయాన్ని వరద చుట్టుముట్టినా పూజారులు మాత్రం యథావిధిగా పూజలు కొనసాగించారు.
 
భారీవర్షాలకు కర్నూలు జిల్లాలో 35వేల హెక్టార్లలో పంట నీట మునగడంతో రూ.250కోట్లకు పైగా పెట్టుబడి నష్టపోయామని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. 12మండలాల్లో 55 గ్రామాలు జలమయమయ్యాయి. 10,500 ఇళ్లల్లోకి నీరు చేరడంతో జనం అవస్థలు పడుతున్నారు. ఎగువన కురుస్తున్న భారీవర్షాలతో కడప జిల్లాలోని కుందూ, పెన్నా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కమలాపురం- ఖాజీపేట మార్గం పాగేరువంక బ్రిడ్జిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట వద్ద వరద ఉధృతి పెరిగింది. గండికోట ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరుతోంది. ప్రాజెక్టులో నీటిమట్టం 12 టీఎంసీలకు చేరువలో ఉండటంతో కొండాపురం, తాళ్లప్రొద్దుటూరు, చామలూరు, ఎర్రగుడి బిక్కుబిక్కుమంటున్నాయి. వరద ఉధృతికి సుమారు 4వేల హెక్టార్లలో వివిధ పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక నివేదిక రూపొందించింది