బోటును బయటకు తీస్తే సంచలనమే!

Published: Thursday September 19, 2019
కచ్చులూరు మందంలోకి పడిపోయిన పర్యాటక బోటును బయటకు తీస్తే అది సంచలనం కాబోతోందా? ఈ బోటును బయటకు తీసే ప్రయత్నాల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రతికూల పరిస్థితులను చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. మహాలోతైన సముద్రాలను, బలిమెల ఘటనలను, ఇతర సరస్సుల్లో మునిగిన బోట్లను బయటకు తీసిన అనుభవాలు కచ్చులూరు మందం ముందు చాలడం లేదు. దేశం నలుమూలల నుంచి ఎందరో ప్రావీణ్యత కలిగిన నిపుణులు భిన్నమైన సాంకేతిక పరిజ్ఞానాలతో ఘటనా స్థలానికి చేరుకుని బోటును చూచాయగా గుర్తించినా దాన్ని బయటకు తీయడంపైనే ఎవరూ స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. గతంలో దేశంలో ఎక్కడ ఎన్ని ఘోర ప్రమాదాలు జరిగినా, ఇంతకు మించి లోతుల్లో చిక్కుకున్న బోట్లను, పెద్ద నావలను సైతం బయటకు తీయగలిగిన పరిస్థితులకు... కచ్చులూరు వద్ద చోటు చేసుకున్న పరిస్థితులకు పొంతన కుదరడం లేదు.
 
కచ్చులూరు మందం వద్ద ఏ స్థాయి యంత్రాన్ని, ఏ స్థాయి బోటు సాయంతో స్థిరంగా నిలపలేని పరిస్థితి. అక్కడ ఉన్న నీటి వడి, నీటిలో ఉన్న బురద తదితర స్థితిగతులు బోటును స్పష్టంగా గుర్తించడానికే అడ్డంకిగా మారాయి. à°ˆ ప్రతికూల పరిస్థితులు లాంటి అనుభవాలు గతంలో ఎక్కడా చోటు చేసుకోవడం, అక్కడ నుంచి 25 టన్నుల బరువు ఉండే బోట్లను బయటకు తీసిన దాఖలాలు లేకపోవడమే కచ్చులూరు వద్ద నిపుణులకు సమస్యగా మారింది. ఎంతటి నిపుణులు వచ్చినా ఇక్కడి పరిస్థితిని చూసి అంతా ప్రయత్నాలకు ప్రతికూలంగా ఉండడంతో à°ˆ బోటును ఎలా తీయాలో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. పోలీసు, రెవెన్యూ, నేవీ, మెరైన్‌, విపత్తుల ఉన్నతాధికారులు ఇక్కడి పరిస్థితిని గుర్తించి వెనుతిరుగుతున్నారు. బోటును కచ్చితంగా గుర్తించగలిగితే దాన్ని బయటకు తీసే పరిస్థితి లేకపోయినా, బోటులోకి ప్రవేశించే అవకాశం ఉంటే, అందులో ఎవరైనా చిక్కుకున్నారా అన్నది నిర్ధారించుకుని, వారిని బయటకు తీసే ప్రయత్నాల్లో భాగంగా అనుభవమున్న డైవర్లను అందులోకి పంపించే మార్గాలను కూడా అన్వేషిస్తున్నారు.
 
బోటులో నుంచి గల్లంతైన వారందరూ ప్రాణాలతోనో లేక విగత జీవులుగానో లభ్యమైతే లెక్కలకు సరిపోతే ఇకబోటును అన్వేషించే సమస్యే ఉండదు. అధికారుల లెక్కల ప్రకారం బోటులో 73మంది ఉంటే అందులో 26మంది సురక్షితంగా బయటపడగా, గల్లంతైన 47మందిలో 34మంది విగత జీవులుగా దొరికారు. ఇంకా 13మంది ఆచూకీ లభించలేదు. రోజురోజుకూ మృతదేహాలు కూడా బయట పడుతుండడంతో తక్కినవారు కూడా విగత జీవులుగా ఏమైనా బయటపడతారేమోనని భావిస్తున్నారు. అదే జరిగితే బోటును బయటకు తీయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. బోటులో ఎవరైనా చిక్కుకుని ఉంటారన్న అనుమానంతోనే బోటును తీయాలన్న ఆలోచన వస్తోంది. బోటులో ఎవరూ లేరని నిర్ధారించుకుంటే మాత్రం బయటకు తీసే యోచనే వదిలేయవచ్చు.