5జీ నెట్‌వర్క్‌లో ఏముంది..?

Published: Monday September 23, 2019
గత రెండేళ్లుగా ఎక్కడ చూసినా 5జి మాట వినిపిస్తోంది. 5జి సపోర్ట్‌ చేసే సామ్‌సంగ్‌ గెలాక్సీ నోట్‌ 10 వంటి మొబైల్స్‌ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటివరకు మనం వాడిన 3జి, 4జిల కన్నా 5జి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. 5జి అంటే కేవలం వేగం మాత్రమే కాదు, కనెక్షన్‌ సాంద్రత పెరగటం, లేటెన్సీ తగ్గడం వంటివి కూడా పరిగణనలోకి తీసుకోవాలి. 5జిని శక్తివంతంగా చేయడం కోసం నోకియా, క్వాల్కమ్‌, ఎరిక్సస్‌, సాంసంగ్‌, ఇంటెల్‌ వంటి కంపెనీలు పరిశోధనల మీద పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టాయి. వాటి ఫలితాలు ఇప్పుడు ఆస్వాదించబోతున్నాం. 5జి ద్వారా అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ని సుదూర ప్రాంతాలకు తక్కువ లేటెన్సీతో కల్పించాలంటే సిగ్నల్స్‌ ప్రసారం చేయబడే విధానం మొత్తం కొత్తగా ఉండాలి. దీన్ని సాధించడం కోసం సాంకేతికంగా అనేక మార్పులు 5జిలో చోటుచేసుకున్నాయి.
 
పైన చెప్పుకున్నట్లు మిల్లీమీటర్‌ తరంగాలు ఎక్కువ డివైజ్‌లు కనెక్ట్‌ కావడానికి కావలసిన బ్యాండ్‌విడ్త్‌ అందించినప్పటికీ వీటితో అనేక ఇతర సమస్యలు ఉంటాయి. ఇది అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ప్రస్తుతం మనం వాడుతున్న వైఫై రూటర్లలో 2.4 గిగాహెర్ట్జ్‌ , 5 గిగాహెర్ట్జ్‌ అనే రెండు రకాల ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్‌ ఉంటాయన్న విషయం చాలామందికి తెలిసిందే. మీరు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి వాటిలో రూటర్‌ కొనాలనుకున్నప్పుడు ఈ విషయాన్ని గమనించవచ్చు. మీరు 5 గిగాహెర్ట్జ్‌ రూటర్‌ కొన్నప్పటికీ అధికశాతం సందర్భాలలో డీఫాల్ట్‌గా 2.4 గిగాహెర్ట్జ్‌ మోడ్‌ మాత్రమే ఎనేబుల్‌ చేయబడి ఉంటుంది. దీనికి కారణం తక్కువ ఫ్రీక్వెన్సీ కలిగిన తరంగాలు ఎక్కువ దూరం ప్రయాణించగలుగుతాయి. ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న తరంగాలు తక్కువ దూరం మాత్రమే ప్రయాణిస్తాయి. దీన్నిబట్టి ఇప్పుడు 5జి విషయానికొస్తే మనం పైన చెప్పుకున్న 300 గిగాహెర్ట్జ్‌ వరకూ ఉన్న హై ఫ్రీక్వెన్సీ తరంగాలు లెక్క ప్రకారం చాలా తక్కువ దూరం మాత్రమే ప్రయాణిస్తాయి. ఈ సమస్యను పరిష్కరించడం కోసం తక్కువ విద్యుత్‌ని వినియోగించుకునే వేలాది చిన్నచిన్న బేస్‌ స్టేషన్స్‌ని టెలికాం కంపెనీలు నెలకొల్పుతాయి. ప్రస్తుతం మనం వినియోగిస్తున్న వైర్‌లెస్‌ స్టేషన్స్‌ కన్నా ఇవి ఒకదానికి మరొకటి అతి సమీపంగా ఉంటాయి. ఇలా దగ్గర దగ్గరలో అతి చిన్న బేస్‌ స్టేషన్స్‌ లభించటం వల్ల, మనం నివసిస్తున్న ప్రదేశంలో పెద్ద పెద్ద భవనాలు, చెట్లు ఉండడం వల్ల సిగ్నల్‌ సరిగా రాకపోతే, మరింత మెరుగైన మరో మినీ బేస్‌ స్టేషన్‌కి మన ఫోన్‌ కనెక్ట్‌ కావడం ద్వారా వేగవంతమైన ఇంటర్నెట్‌ పొందగలుగుతాం.
 
చాలా సందర్భాల్లో యూజర్లు ఒకటే ఫిర్యాదు చేస్తూ ఉంటారు.. మాకు 4జి సిగ్నల్‌ చాలా చూపిస్తోంది గానీ, స్పీడ్‌ మాత్రం సరిగా రావడం లేదని! దీనికి ప్రధాన కారణం నెట్‌వర్క్‌ కెపాసిటీ సరిగా లేకపోవడం! ప్రస్తుతం మనం వాడుతున్న 4జి నెట్‌వర్క్‌లో యాంటెన్నాలు గరిష్టంగా కేవలం 12పోర్టులు మాత్రమే కలిగి ఉంటాయి. వాటిలో డేటాని బదిలీ చేయటం కోసం కేవలం ఎనిమిది పోర్టులే ఉపయోగించబడతాయి. వీటిలో నాలుగు పోర్టులు యూజర్ల ఫోన్ల నుంచి డేటాని బయటకు పంపించడానికి, మిగిలిన నాలుగు డేటాని రిసీవ్‌ చేసుకోవడానికి కేటాయించబడి ఉంటాయి. ఈ కారణం చేతే మనకు సరిపడా మొత్తంలో నెట్‌వర్క్‌ కెపాసిటీ లభించదు. అయితే ప్రస్తుతం రాబోతున్న 5జిలో వంద పోర్టుల వరకూ సపోర్ట్‌ చేస్తుంది. అంతేకాదు ఒకే వలయంలో అనేక యాంటెన్నాలు ఉండే విధంగా కూడా వెసులుబాటు కల్పిస్తుంది. ఈ కారణం చేత పరోక్షంగా అధికశాతం మంది వినియోగదారులు 5జి బేస్‌ స్టేషన్‌కి కనెక్ట్‌ అయి ఎలాంటి ఇబ్బంది లేకుండా హై స్పీడ్‌ ఇంటర్నెట్‌ ఆస్వాదించగలుగుతారు. ఈ టెక్నాలజీని మాసివ్‌ ఇన్‌పుట్‌ మాసివ్‌ ఔట్‌పుట్‌ (మిమో) అనే పేరుతో పిలుస్తారు.