రైతు భరోసా....47.80 లక్షల మందికే అర్హత!

Published: Sunday October 13, 2019
రైతు భరోసా పథకం ప్రారంభ తేదీ దగ్గర పడడంతో లబ్ధిదారుల తుది జాబితా తయారీకి వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు కుస్తీ పడుతున్నారు. వ్యవసాయశాఖ విడుదల చేసిన ప్రాథమిక జాబితాలో చాలా మంది అర్హుల పేర్లు లేకపోవడంతో సదరు రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వెబ్‌ల్యాండ్‌లో భూ వివరాలు సరిగా లేకపోవడం, ఆయా సర్వే నెంబర్లకు మరొకరి ఖాతా నెంబరు జతకలిసి ఉండడం, కొందరికి ఆధార్‌, బ్యాంక్‌ అకౌంట్లు అనుసంధానం కాకపోవడం, మరికొందరికి ప్రజాసాధికార సర్వేలో పూర్తి వివరాలు లేకపోవడం వంటి కారణాలతో రైతుభరోసా జాబితాలో వేలాది మంది రైతుల పేర్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో రైతుల ఫిర్యాదులతో అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారు. మరోవైపు సాధికార సర్వేలో కుటుంబసభ్యులు, భూముల వివరాలు లేనివారు వాటిని చేర్పించుకునేందుకు, ఆధార్‌ అనుసంధానానికీ రైతులు మీసేవ కేంద్రాలు, రెవెన్యూ కార్యాలయాలకు క్యూకట్టారు. à°ˆ వివరాల నమోదుకు శనివారం ఆఖరి తేదీగా అధికారులు ప్రకటించడంతో అనేక ప్రాంతాల్లో రెవెన్యూ కార్యాలయాలు రెండో శనివారమైనప్పటికీ కిక్కిరిసి పోయాయి. ఇదిలావుంటే, రైతు భరోసా మార్గదర్శకాల్లో కీలకమైన నిబంధనపై అధికారులు దృష్టి సారించారు. మంత్రి ఆదిమూలం సురేశ్‌ పేరు జాబితాలో రావడం అధికార వర్గాల్లో సంచలనం కలిగించింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు, రాజ్యాంగ పదవులు నిర్వహిస్తున్నవారు, గతంలో నిర్వహించిన వారి పేర్లు జాబితాలో ఉన్నాయేమోనని నిశితంగా పరిశీలిస్తున్నారు.
 
గతంలో ఉన్న కౌలుదారుల చట్టాన్ని రద్దు చేసిన ప్రస్తుత ప్రభుత్వం కౌలు సాగుదారుల చట్టం-2019ని తెచ్చింది. దీని ప్రకారం తాజాగా భూ యజమానులతో గ్రామ సచివాలయాల్లో ఒప్పందాలు చేసుకుని, సాగుదారు హక్కు పత్రం(సీసీఆర్‌సీ) తీసుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17,642 గ్రామాలకు చెందిన సుమారు 80 వేల మంది కౌలు రైతులకు సీసీఆర్‌సీలు జారీ చేశారు. అయితే, రైతుభరోసాలో లబ్ధి పొందాలంటే కొత్తగా సీసీఆర్‌సీ తప్పని సరా? లేక గతంలో ఇచ్చిన సీవోసీ, ఎల్‌ఈసీలు ఉంటే సరిపోతుందా? అనే అంశంపై స్పష్టత కొరవడింది. సీజన్‌ ప్రారంభంలో మౌఖికంగా కౌలు ఒప్పందాలు చేసుకున్న రైతులు ఇప్పుడు రాతపూర్వక సమ్మతిని తెలపడానికి ముందుకు రాకపోవడంతో à°ˆ సంఖ్య తగ్గినట్లు చెప్తున్నారు. ఇతరులకు రైతు భరోసా వర్తించకపోయినా కౌలు ఒప్పందాల ప్రకారం సీసీఆర్‌సీలు జారీ చేస్తున్నారు. గతంలో తీసుకున్న సీవోసీ, ఎల్‌ఈసీ కార్డులు చెల్లకపోతే, సీసీఆర్‌సీలు అందని కౌలురైతులకు పెట్టుబడి సాయం అందిస్తారా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కౌలురైతుల విషయంలో ప్ర భుత్వం ప్రకటించిన సంఖ్యలో సగం మందికి కూడా రైతుభరోసా వర్తించే పరిస్థితి కన్పించడం లేదని కౌలు రైతు సంఘాల నేతలు పెదవివిరుస్తున్నారు. కాగా, పథకాన్ని ప్రారంభించిన తర్వాత à°ˆ నెలాఖరు వరకు అర్హుల గుర్తింపు, అనర్హుల తొలగింపు, కౌలు రైతులకు సీసీఆర్‌సీలు జారీ ప్రక్రియ కొనసాగుతుందని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ప్రకటించారు. అలాగే రైతుభరోసా జాబితాలో అర్హుల చేర్పు, అనర్హుల తొలగింపు కోసం గ్రీవెన్స్‌ నిర్వహిస్తామన్నారు.